
డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
బుక్కరాయసముద్రం: మార్కులు సరిగా రాలేదంటూ తండ్రి మందలింపుతో మనస్తాపం చెంది డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు... బీకేఎస్ మండలం పొడరాళ్ల గ్రామానికి చెందిన రవి కుమార్తె వాణి (20) అనంతపురంలోని కళాశాలలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఆన్‌లైన్ ద్వారా బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్న ఆమె కోచింగ్‌కు నిర్వహించిన పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయి. విషయం తెలుసుకున్న తండ్రి మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన బుధవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
గుత్తిలో నేడు ఎస్టీయూ జిల్లా కార్యవర్గ సమావేశం
అనంతపురం ఎడ్యుకేషన్/గుత్తి: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) జిల్లా మొదటి కార్యవర్గ సమావేశం శుక్రవారం గుత్తిలోని పద్మవాణి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నీలూరు రమణారెడ్డి, గుత్తి మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆసీఫ్, బసవరాజు, జిల్లా నాయకులు డి.శివశంకర్ తెలిపారు. ఈ మేరకు గురువారం వారు వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాన చర్చ ఉంటుందన్నారు. అలాగే విద్యారంగంలోని పాఠశాలల మనుగడ, ఉపాధ్యాయులకు రావాల్సిన ఆర్థిక బకాయిలపై చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయిశ్రీనివాస్, ప్రధానకార్యదర్శి ఎం.రఘునాథరెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శి నారాయణస్వామి ముఖ్య అతిథులుగా హాజరవుతారని వెల్లడించారు. అన్ని మండలాల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు హాజరై విజయవంతం చేయాలని రమణారెడ్ది పిలుపునిచ్చారు.