
దళిత కుటుంబంపై టీడీపీ నేత దాడి
ఉరవకొండ: వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో ఓ దళిత కుటుంబంపై ఆ గ్రామ టీడీపీ నేత, మాజీ సర్పంచ్ ఎర్రిస్వామి, ఆయన కుటుంబసభ్యులు దాడికి తెగబడ్డారు. బాధిత కుటుంబ యజమాని సురేష్‌బాబు తెలిపిన మేరకు... కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సురేష్‌బాబు కుమార్తెను కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన యువకుడు తేజ వేధింపులకు గురి చేస్తూ వచ్చాడు. దీనిపై గతంలో వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదు. ఇటీవల సురేష్‌బాబు కుమార్తెను తేజ కలసి మైనారిటీ తిరగానే పెళ్లి చేసుకుంటానని, తనను ఎవరూ అడ్డుకోలేరంటూ అనుచితంగా ప్రవర్తించాడు. దీంతో విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళితే వారు తేజాను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపేశారు. అదే సమయంలో యువకుడి ఫోన్‌లో తనకు అడ్డంగా ఉన్న యువతి తండ్రి సురేష్‌బాబును హతమార్చేలా రూ.లక్ష సుపారీ ఇచ్చి ఒప్పందం చేసుకున్నట్లు ఉన్న ఆడియో బయటపడింది. ఈ ఆడియోను పోలీసులకు ఇవ్వడంతో యువకుడు మద్యం మత్తులో మాట్లాడి ఉంటాడని కొట్టి పడేశారు. అనంతరం రోజూ స్టేషన్‌కు వచ్చి సంతకం పెట్టి పోవాలని యువకుడికి పోలీసులు సూచించారు. ఈ వ్యవహారంలో టీడీపీ సీనియర్ నాయకుడు ఎర్రిస్వామి జోక్యం చేసుకుని యువకుడిపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా బయటకు తీసుకొచ్చారు. ఇది అన్యామంటూ సుధాకర్‌బాబు కుటుంబసభ్యులు ఎర్రిస్వామిని నిలదీస్తే దళితులై ఉండి తన ఇంటి వద్దకు ఎలా వస్తారంటూ దూషణలకు దిగడమే కాక మహిళలని కూడా చూడకుండా ఎర్రిస్వామి, ప్రకాష్, హనుమేష్‌తో పాటు మరో 10 మంది ఇష్టారాజ్యంగా దాడి చేశారు. అక్కడితో ఆగకుండా చర్చి వద్ద ఉన్న సురేష్‌బాబుపై ఎర్రిస్వామి ఇనుప రాడ్‌తో దాడి చేశాడు. ఘటనలో సురేష్‌బాబుతో పాటు కుమార్తె, ఇతర కుటుంబసభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనపై వజ్రకరూరు ఎస్‌ఐ నాగస్వామి మాట్లాడుతూ.. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.