
సాక్షి, అమరావతి: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం, సోమవారం తిరుపతిలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం సాయంత్రం ఆయన తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమల వెళ్లి.. రాత్రి బస చేస్తారు. 27వ తేదీ ఉదయం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు. అనంతరం తిరుపతికి చేరుకొని.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరి వెళతారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం సాయంత్రం 5 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ స్వాగతం పలకనున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి సీఎం చేరుకుంటారు. కాగా, ప్రధాని మోదీ, సీఎం జగన్ పర్యటనల నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ విమానాశ్రయం నుంచి తిరుమల కొండపైకి చేరుకునే రోడ్డు మార్గం వెంబడి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.