
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షుడిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. లక్షలాది మంది పార్టీ కార్యకర్తల కరతాళధ్వనుల మధ్య ప్లీనరీ రెండో రోజు శనివారం పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు. మొదటి రోజు నిర్వహించిన పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నికలో వైఎస్ జగన్ తరఫున 22 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతరులెవరూ నామినేషన్లు వేయలేదు. దాంతో పార్టీ జీవిత కాల జాతీయ అధ్యక్షునిగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
అనంతరం వేదిక మీద ఉన్న నాయకులంతా సీఎం వైఎస్ జగన్‌ను అభినందనలతో ముంచెత్తగా.. ఆయన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. పార్టీ రాజ్యాంగానికి ప్లీనరీలో పలు సవరణలు చేశారు. ఈ సవరణల ప్రతిపాదనలకు కార్యకర్తలు హర్షాతిరేకాలతో ఆమోదం తెలిపారు. ‘ఆర్టికల్ ఒకటి ప్రకారం యువజన, శ్రామిక, రైతు కాంగ్రెస్ పార్టీని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగా లేదా వైఎస్సార్‌సీపీగా గుర్తించవచ్చు’ అన్న సవరణకు ఆమోదం తెలిపారు. ఆర్టికల్ 8,9 వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం ప్రకారం.. పార్టీ అధ్యక్షులు జీవిత కాల పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారని చేసిన మరో సవరణకు ఆమోదం తెలిపారు.
10 తీర్మానాలకు ఆమోదం
రెండు రోజులపాటు జరిగిన వైఎస్సార్‌సీపీ ప్లీనరీ సమావేశాల్లో మొత్తం పది తీర్మానాలకు ఆమోదం తెలిపారు. తొలి రోజు మహిళా సాధికారత–దిశ చట్టం, విద్యా రంగం, నవరత్నాలు–డీబీటీ, వైద్య ఆరోగ్యంపై తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదించారు. రెండోరోజు పరిపాలనా వికేంద్రీకరణ–పారదర్శకత, సామాజిక సాధికారత, వ్యవసాయం, పరిశ్రమలు–ప్రోత్సాహకాలు, ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం, పార్టీ రాజ్యాంగ సవరణ తీర్మానాలపై చర్చించి ఆమోదించారు.