
సాక్షి, అమరావతి: భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా ఆలయాల్లో నిరంతర తనిఖీలు చేపట్టాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. జిల్లా స్థాయిలో అసిస్టెంట్ కమిషనర్ మొదలు.. డిప్యూటీ కమిషనర్, ప్రాంతీయ జాయింట్ కమిషనర్(ఆర్‌జేసీ)లు వారానికి మూడు, నాలుగు రోజుల పాటు తమ పరిధిలో తనిఖీలు చేపట్టాలని దేవదాయ శాఖ కమిషనర్ వాణీమోహన్ తాజాగా ఆదేశాలిచ్చారు. 6(ఏ) కేటగిరిలో ఉండే పెద్ద ఆలయాల్లో ఏటా ఒకసారైనా, 6(బీ) కేటగిరి ఆలయాల్లో రెండేళ్లకోసారి, 6(సీ) కేటగిరి ఆలయాల్లో మూడేళ్లకోసారైనా తనిఖీలు చేయాలని పేర్కొన్నారు.
తనిఖీ జరిపే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలోనే ఉండి.. అన్ని రకాల ఆలయ రికార్డులను పరిశీలించాలని, గుర్తించిన అంశాలను రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించారు. రూ.కోటి పైబడి ఆదాయం ఉన్న ఆలయాల్లో అడిషనల్ కమిషనర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తారని ఆదేశాల్లో పేర్కొన్నారు. డిప్యూటీ కమిషనర్, ఆర్‌జేసీ స్థాయి అధికారులు ప్రతి నెలా తమ పరిధిలోని ఏదో ఒక ఆలయానికి తప్పనిసరిగా తనిఖీ చేయాలని ఆదేశించారు. అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారులు తమ పరిధిలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో పర్యటించడంతో పాటు రాత్రి వేళ కూడా ఏదో ఒక ఆలయంలోనే బస చేసి, అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించాలని దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశించారు.