
సాక్షి, అమరావతి: దేవదాయ శాఖ పరిధిలోని 11 ప్రముఖ ఆలయాల్లో భక్తులకు పంచిపెట్టే ప్రసాదాలకు కేంద్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ సర్టిఫికెట్లు దక్కబోతున్నాయి. కేంద్ర ఫుడ్ సేఫ్టీ విభాగం ఇటీవల ప్రసాదాల నాణ్యత ఆధారంగా భోగ్(దేవునికి సమర్పించే పరిశుభ్రమైన నైవేద్యం) పేరుతో సర్టిఫికెట్లు జారీ చేసే విధానానికి శ్రీకారం చుట్టింది.
రాష్ట్రంలో శ్రీశైలం, శ్రీకాళహస్తి, బెజవాడ దుర్గగుడి, సింహాచలం, కాణిపాకం, అన్నవరం, పెనుగంచిప్రోలు, విశాఖపట్నం కనకమహాలక్ష్మీ, కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి, మహానంది, ద్వారకా తిరుమల ఆలయాల్లోని ప్రసాదాలకు సర్టిఫికెట్ జారీ చేసేందుకు ఫుడ్ సేఫ్టీ విభాగం ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో 11 ప్రధాన ఆలయాల ఈవోలు ప్రసాదాలకు భోగ్ సర్టిఫికెట్ కోసం వెంటనే ఫుడ్ సేఫ్టీ విభాగానికి దరఖాస్తు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ హరి జవహర్‌లాల్ శనివారం ఆదేశాలిచ్చారు.