
టీడీపీ ఇన్‌చార్జి రూపానందరెడ్డి, జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ ఒంటెత్తు పోకడలపై కార్యకర్తల ఆగ్రహం
టీడీపీ కార్యాలయంపై దాడి.. అద్దాలు ధ్వంసం, విరిగిన కుర్చీలు
రెండు గంటలపాటు ఇన్‌చార్జి మంత్రి దిగ్బంధం
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. శనివారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి జనార్దన్‌రెడ్డి సమక్షంలోనే టీడీపీ నూతన కార్యాలయంపై దాడి జరిపి అద్దాలు ధ్వంసం చేశారు. జనసేన ఎమ్మెల్యేను చుట్టుముట్టారు. దీంతో జాతీయ రహదారిపై మూడు గంటలపాటు గందరగోళ వాతావరణం నెలకొంది. మంత్రి జనార్దన్‌రెడ్డి, టీడీపీ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి, జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ టీడీపీ కార్యాలయంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. 2 గంటల తర్వాత పోలీసుల సమక్షంలో షట్టర్లు తెరిచి మంత్రిని, మిగిలిన వారిని బయటకు పంపించారు.
ఇదీ నేపథ్యం
టీడీపీ మాజీ ఇన్‌చార్జి కస్తూరి విశ్వనాథ నాయుడు చాలాకాలంగా రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జిగా ఉంటూ టీడీపీ మనుగడను కాపాడారు. అయితే, వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ముక్కా రూపానందరెడ్డికి చంద్రబాబు పార్టీ పగ్గాలు అప్పగించడంతో టీడీపీ వర్గాల్లో అసంతృప్తి నెలకొంది. నూతన ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి తన ప్రాబల్యంతో చంద్రబాబును ఒప్పించి జనసేనకు కేటాయించిన సీటును తన వర్గీయుడు అరవ శ్రీధర్‌కు ఇప్పించుకున్నారు.
అనంతరం వీరిద్దరు ఒంటెత్తు పోకడలతో టీడీపీ నేతలను దూరం పెడుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అభిమానులు మంత్రి రాకను తెలుసుకుని అక్కడికి చేరుకుని ఆగ్రహం వ్యక్తం చేసి గందరగోళం సృష్టించారు. కాగా.. రైల్వేకోడూరు మాజీ టీడీపీ ఇన్‌చార్జి విశ్వనాథనాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్ పార్టీ కార్యాలయం లోపల ఉన్న మంత్రిని కలిసి పార్టీని నమ్ముకుని ఎన్నో ఏళ్ల నుంచి తాము పనిచేస్తున్నప్పటికీ చిన్నచూపు చూడటం సబబు కాదని తెలిపారు.
అనంతరం మాజీ ఇన్‌చార్జి విశ్వనాథ నాయుడు మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి చెందిన వ్యక్తిని రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జిగా నియమించినా పార్టీపై అభిమానంతో అధిష్టానం మాటల్ని నమ్మి ఇన్‌చార్జికి సహకరిస్తూ వచ్చామన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ న్యాయం చేయాలని, ఒంటెత్తు పోకడలు సరికాదన్నారు. ఈ ఘటనతో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్యే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించడం గమనార్హం.