
వనపర్తి దేవి (ఫైల్)
సాక్షి, జంగారెడ్డిగూడెం: భార్యాభర్తల మధ్య తగాదాల నేపథ్యంలో మనస్తాపంతో భార్య ఈగలమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఎం.సాగర్‌బాబు తెలిపిన వివరాలు ప్రకారం ఎ.పోలవరం గ్రామానికి చెందిన వనపర్తి సతీష్‌తో అదే గ్రామానికి చెందిన దేవి (20)కి రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి మూడు నెలల పాప ఉంది. బుధవారం ఉదయం సతీష్ కూలిపనికి వెళ్లి మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. అనంతరం సతీష్ పనికి వెళ్లిపోయాడు.
గొడవ నేపథ్యంలో మనస్తాపం చెందిన దేవి ఈగలమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దేవి అత్త నిర్మల గమనించి, కుటుంబ సభ్యులతో కలిసి వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఈ ఘటనపై దేవి సోదరి ఎ.పోలవరానికి చెందిన తమ్మిశెట్టి నాగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తన చెల్లెలు దేవి, బావమరిది సతీష్‌ది ప్రేమ వివాహమని, అయితే సతీష్‌కు వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంటంతో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని, ఇటీవల ఫోన్ విషయమై గొడవ జరిగి తన చెల్లెలిని కొట్టాడని, దీంతో మనస్తాపం చెంది ఈగల మందు తాగిందని ఫిర్యాదులో పేర్కొంది. సతీష్ బలవంతంగా తన చెల్లితో మందు తాగించాడనే అనుమానం ఉందని, న్యాయం చేయాలని ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చదవండి: (నారాయణ సంస్థలపై సీఐడీ దాడులు.. సంచలన విషయాలు వెలుగులోకి!)