
సాక్షి, విశాఖపట్నం: రెండు రోజుల క్రితం తెలంగాణ, ఒడిశా మీదుగా ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. రాయలసీమ నుంచి దక్షిణ ఛత్తీస్‌గఢ్ వరకు తూర్పు ప్రాంతంలో ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 0.9 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకటి, రెండుచోట్ల, తెలంగాణలో అక్కడకక్కడా తేలికపాటి జల్లులు కురిసే సూచనలు ఉన్నాయని, పలుచోట్ల ఆకాశం మేఘావృతమై ఉంటుందని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు శుక్రవారం తెలిపారు.
ఉపరితల ద్రోణి ప్రభావంతో వాతావరణం చల్లబడే సూచనలు మాత్రం కనిపించడం లేదని, గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రానున్న మూడు రోజులపాటు పగటి ఉష్ణోగ్రతలు కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు, రాయలసీమ జిల్లాల్లో 1 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలంగాణకు వర్ష సూచన..
తెలంగాణలో చూస్తే పూర్తిగా పొడి వాతావరణమే ఉండనుంది. రాబోయే మూడు రోజులు ఉదయం వేళ కొన్నిచోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతల్లో పెద్ద మార్పు ఉండదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని అంచనా వేసింది.
మరోవైపు ఏపీ, తెలంగాణలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతూ వస్తోంది. చాలాచోట్ల ఇప్పటికే 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటిన పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో పరిస్థితి పూర్తిగా మారే అవకాశం కనిపిస్తోంది. వేసవి నేపథ్యంలో ప్రజలంతా జాగ్రతగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.