
కృష్ణా జిల్లా గోసాలలో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం నిర్వాకం
రాత్రంతా కొడుకుతో కలిసి కళాశాల గేటు వద్ద తండ్రి నిరసన
ఫీజు చెల్లించేందుకు గడువు కోరినా ఇబ్బంది పెట్టారంటూ ఆరోపణ
మీడియా, పోలీసులు రావడంతో విద్యార్థిని అనుమతించిన యాజమాన్యం
కంకిపాడు: ఫీజు కట్టలేదని విజయవాడ సమీపంలోని గోసాల శ్రీచైతన్య కళాశాల నుంచి యాజమాన్యం ఓ విద్యార్థిని అర్థరాత్రి వేళ బయటకు పంపించేసింది. దీంతో ఆ విద్యార్థి, అతని తండ్రి కళాశాల గేటు వద్ద బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. మీడియాకు సమాచారం వెళ్లటంతో అప్రమత్తమైన కళాశాల యాజమాన్యం విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆబోతు టార్జాన్ కుమారుడు గౌతమ్ శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు.
సంక్రాంతికి ఇంటికి వెళ్లిన గౌతమ్ ఆదివారం రాత్రి తన తండ్రితో కలసి కళాశాలకు వచ్చాడు. ఫీజు చెల్లిస్తేనే కళాశాలలోకి అనుమతిస్తామని కళాశాల సిబ్బంది చెప్పారు. టార్జాన్ తన వద్ద ఉన్న రూ 20 వేలు నగదును చెల్లించాడు. మిగిలిన రూ. 50 వేలు చెల్లించేందుకు కొంత సమయం ఇవ్వాలని బతిమలాడారు. అందుకు యాజమాన్యం ససేమిరా అని విద్యార్థిని కళాశాల నుంచి పంపించేసింది. దీంతో విద్యార్థి గౌతమ్, అతని తండ్రి టార్జాన్ అర్ధరాత్రి కళాశాల గేటు వద్దే నిరసన వ్యక్తం చేశారు.
పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఏప్రిల్‌లో పరీక్షలు ఉన్నాయని, ఆ లోపు ఫీజు చెల్లిస్తానని చెప్పినా యాజమాన్యం అంగీకరించలేదని వాపోయారు. నిర్దాక్షిణ్యంగా తమను బయటకు పంపించేశారని తెలిపారు. పోలీసులు కూడా కళాశాలకు చేరుకుని ఆరా తీశారు. దీంతో యాజమాన్యం విద్యార్థి, అతని తండ్రితో మాట్లాడి విద్యార్థిని కళాశాలలోకి అనుమతించింది.