
8వేల ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ల రద్దుకు చర్యలు
మదనపల్లె సబ్‌కలెక్టరేట్ దగ్ధం ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు
కాలిపోయిన 2,400 ఫైల్స్ రీ క్రియేట్
రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా
మదనపల్లె: రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీహోల్డ్ చేసిన భూముల్లో, నిబంధనలకు విరుద్ధంగా చేసిన 4 లక్షల ఎకరాల భూములను రద్దు చేసినట్లు రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పీ.సిసోడియా అన్నారు. బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అగ్నిప్రమాద ఘటన తర్వాత ఆధునికీకరించిన సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ...గతేడాది జూలై 21న మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో దాదాపు 2,400 ఫైళ్లు కాలిపోయాయన్నారు. ఈ ఫైళ్లకు సంబంధించి ఆయా మండల తహసీల్దార్ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్‌లో లింకుల ద్వారా వాటిని రీ క్రియేట్ చేశామని చెప్పారు. 22(ఏ) ఫైల్స్‌కు సంబంధించి విచారణ జరుగుతోందన్నారు.
ప్రమాద ఘటన జరిగిన తర్వాత మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో బాధితులు తనకు 480 అర్జీలు సమర్పించారని, వాటిలో 80 శాతం వరకు పరిష్కరించామని తెలిపారు. మిగిలిన 20 శాతం కోర్టు కేసులు, ఆర్‌వోఆర్, వెరిఫికేషన్స్ కారణంగా నిలిచిపోయాయని, త్వరలో వాటినీ పరిష్కరిస్తామన్నారు.
సబ్ కలెక్టరేట్ అగ్నిప్రమాద ఘటన దర్యాప్తు మరింత లోతుగా జరుగుతోందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఫ్రీహోల్డ్ భూముల్లో 25 వేల ఎకరాల భూములకు రిజిస్ట్రేషన్‌లు జరిగాయన్నారు. వాటిలో 8 వేల ఎకరాలు అక్రమంగా రిజిస్ట్రేషన్‌లు జరిగినట్లు గుర్తించామని, వాటిని రద్దుచేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.