
క్షేత్రస్థాయిలో జనన, మరణ రిజిస్ట్రేన్ల ప్రక్రియ
సకాలంలో జరిగేలా చర్యలు
జనన మరణ రిజిస్ట్రేన్ చట్టం–2023పై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష
సాక్షి, అమరావతి: జనన, మరణ నమోదు (సవరణ చట్టం–2023)పై మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను నియంత్రించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయిలో జరిగే జనన, మరణ రిజిస్ట్రేన్ల ప్రక్రియ సకాలంలో జరిగేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. నకిలీ పత్రాలను నియంత్రించేందుకు పాత రికార్డులను డిజిటలైజేషన్ చేయాలన్నారు.
ఈ చట్టానికి సంబంధించి పూర్తి స్థాయి నిబంధనలు, మార్గదర్శకాల నోటిఫికేషన్ వచ్చేలోగా క్షేత్రస్థాయి అధికారులందరికీ ఈ చట్టంపై పూర్తి అవగాహన కోసం తగిన సమాచారాన్ని అందించాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. జననాలతో పాటు మరణాలు కూడా గ్రామ, మున్సిపాలిటీల స్థాయిలోను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల సహా ప్రతి చోటా సకాలంలో సక్రమంగా రిజిస్టర్ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యమిత్రల ద్వారా జనన, మరణ రిజిస్ట్రేన్ల నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొత్త చట్టంలోని ముఖ్యాంశాలను వివరించారు. ఈ నూతన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రవేశానికి, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు జాబితా సవరణ, వివాహ రిజిస్ట్రేషన్, పాస్‌పోర్టు జారీ, ఆధార్, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం తప్పనిసరని తెలిపారు.
ఇంకా పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్ అభిషేక్ గౌడ, న్యాయశాఖ కార్యదర్శి జి.సత్యప్రభాకరరావు తదితర అధికారులు పాల్గొన్నారు.