
పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రశ్నాపత్రాల తరలింపు
మే 4న నీట్ పరీక్ష
అనుమానాల నివృత్తికి ప్రత్యేక వెబ్‌సైట్‌లు
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన నీట్ యూజీ–2025 పరీక్షను పకడ్బందీగా నిర్వహించడానికి కేంద్ర విద్యా శాఖ ముమ్మర కసరత్తు చేస్తోంది. మే 4న దేశవ్యాప్తంగా 550 నగరాలు, పట్టణాల్లో 5,000 సెంటర్‌ల్లో ఈ పరీక్ష నిర్వహించనుంది. గతేడాది నీట్ ప్రశ్నాపత్రం లీక్, అవకతవకలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా నీట్ నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా పోలీస్ ఎస్కార్ట్‌తో ప్రశ్నాపత్రాలు, ఓఎంఆర్ షీట్‌లు, ఇతర కీలక సామాగ్రిని తరలించనున్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ భద్రతతో బహుళ అంచెల్లో తనిఖీలు చేపట్టనున్నారు. వ్యవస్థీకృత మోసాలను అరికట్టడంపైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. కోచింగ్ సెంటర్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో కార్యకలాపాలపైనా నిఘా పెట్టారు. నీట్ అభ్యర్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా పరీక్ష పత్రాలు లీక్, అవకతవకలు, ఇతర ఆరోపణలతో పుకార్లు పుట్టుకువస్తున్నాయి. ఈ సందర్భాల్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) వివరణలు ఇస్తూ వస్తోంది.
నీట్ 2025పై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో తలెత్తే అనుమానాస్పద అంశాలు, సందేహాలను తెలియజేయడానికి ప్రత్యేక వెబ్‌సైట్‌లను ఎన్టీఏ అందుబాటులోకి తెచ్చింది. https:// neet. nta. ac. in, https:// nta. ac. in వెబ్‌సైట్‌ల్లో అభ్యర్థులు తమ దృష్టికి వచ్చిన అనుమానాలను తెలియజేసేందుకు వీలు కలి్పంచారు. ఈ వెబ్‌సైట్‌లు మే 4న సాయంత్రం 5 గంటల నుంచి అందుబాటులోకి రానున్నాయి.