
2014–19 మధ్య దాదాపు రూ.3.5 వేల కోట్లతో సుమారు 9 లక్షల పాండ్స్ నిర్మాణం
అప్పట్లో పొక్లెయిన్లతో గుంతలు తవ్వి కూలీల పేరుతో బిల్లులు దండుకున్నట్లు ఆరోపణలు
అయినా వాటి నిర్మాణానికే మళ్లీ సర్కారు మొగ్గు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు పనులు కల్పించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఉపాధి హామీ పథకంపై కూటమి కుట్రలు మళ్లీ కమ్ముకుంటున్నాయి. గత టీడీపీ హయాంలో వివాదాస్పదమైన విధానాలే మళ్లీ ఊపిరిపోసుకుంటున్నాయి. ఇదే జరిగితే తమ ‘ఉపాధి’కి దెబ్బేనని కూలీలు కలవరపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సొంత పొలాల్లో మళ్లీ ఫాం పాండ్స్ నిర్మాణం చేపట్టడమే వీరి ఆందోళనకు కారణం.
ఇలా అయితే కోట్లాది రూపాయలు తేలిగ్గా దండుకోవచ్చని పాలకుల పన్నాగం. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలతో చేపట్టే చెరువుల పూడికతీత పనులను తగ్గించి ఈ వేసవిలో రైతుల సొంత పొలాల్లో ఫాం పాండ్స్ (పంట కుంటల) పనులకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014–19 మధ్య దాదాపు రూ.మూడున్నర వేల కోట్లతో సుమారు 9 లక్షల ఫాం పాండ్స్ నిర్మాణాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టి తీవ్ర విమర్శలపాలైంది. ఇప్పుడు వాటిలో 10–20 శాతం (అంటే రెండు లక్షలైనా) కూడా కనిపించవేమోనని అధికారులు అనుమానిస్తున్నారు.
అయినా, ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్లీ అదే పంథా అనుసరిస్తోంది. ఈ వేసవిలో ఉపాధి హామీ పథకం కింద అప్పట్లాగే రెండున్నర లక్షల ఫాం పాండ్స్ నిర్మించాలని గ్రామీణాభివృద్ధి శాఖాధికారులకు ఆదేశాలిచ్చింది. ముందుగా.. రూ.900 కోట్లతో 1.40 లక్షల ఫాం పాండ్స్‌ను రైతు పొలాల్లో తవ్వుకునేందుకు అనుమతులిచ్చేశారు. మూడునెలల పాటు గ్రామాల్లో దీనినే మొదటి ప్రాధాన్యతగా భావించాలని ప్రభుత్వం సూచించింది.
ఫాం పాండ్స్ అంటేనే అవినీతి..
పది మీటర్ల పొడువు, పది మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల లోతు చొప్పున ఒక్కో ఫాం పాండ్ నిర్మాణంలో సరాసరి 200 మంది కూలీలు పనిచేయడం ద్వారా వారికి రూ.50 వేల చొప్పున వేతనాలు చెల్లించేలా అధికారులు అంచనాలు సిద్ధంచేశారు. మరో రూ.10 వేలు చొప్పున ఒక్కో ఫాం పాండ్స్‌కు మెటీరియల్ కేటగిరిలో నిధులు అందజేసే అవకాశముంది. అయితే, 200 మంది కూలీలతో తవ్వే ఫాం పాండ్స్‌ను పొక్లెయిన్‌తో తవ్వితే కేవలం రూ.ఐదారు వేలతో పూర్తవుతుంది.
దీంతో ఈ పనుల్లో భారీ అవినీతికి అస్కారం ఉందని.. గత చరిత్ర ఇదే చెబుతోందని పలువురు అధికారులు గుర్తుచేస్తున్నారు. ఎందుకంటే.. అప్పట్లో కూలీల ద్వారా తవ్వించాల్సిన ఫాం పాండ్స్‌ను పొక్లెయిన్‌తో తవ్వించి.. తమ కుటుంబ సభ్యులు, బంధువుల పేర్లతో కూలీల జాబితాను రూపొందించి దానిని స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్లకు ఇచ్చి కూలీల వేతనాల పేరుతో ఉపాధి హామీ నిధులను దండుకున్నారని విమర్శలు వచ్చాయి.
ఫాం పాండ్స్‌తో పేదలకు దెబ్బే
ఈ వేసవిలో ఫాం పాండ్స్ పనులకే ప్రాధాన్యత ఇవ్వడంవల్ల తమ ఉపాధికి గండిపడుతుందని కూలీలు ఆందోళన చెందుతున్నారు. ఏప్రిల్ నుంచి మొదలయ్యే 2025–26 ఆర్థిక సంవత్సరం మొత్తంలో రాష్ట్రంలో ఏడాది పాటు ఉపాధి హామీ పథకం ద్వారా 15 కోట్ల పనిదినాలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అనుమతులిచ్చింది. అయితే, ఇందులో గ్రామాల్లో పనులు దొరకని ఈ వేసవి మూడునెలల కాలంలో 12 కోట్ల పనిదినాల పనుల కల్పనకు అవకాశముండగా, 3–4 కోట్ల పనిదినాలు కేవలం ఫాం పాండ్స్ పనులకే కేటాయించే అవకాశముంది.
దీనివల్ల కూటమి నేతలు పొక్లెయిన్ల ద్వారా తవ్వించేసి దొంగ మస్తర్లతో పేదల ఉపాధికి గండికొట్టే ప్రమాదముంది. ఎందుకంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉపాధి పనుల కల్పనలో తీసుకొచ్చిన మార్పులతో వ్యక్తిగతంగా కాకుండా శ్రమశక్తి సంఘాల వారీగా పనులను కేటాయిస్తున్నారు. ఇది అధికార పార్టీ నేతలకు మరింత మేలు చేసింది. వీరికి అనుకూలంగా ఉండే శ్రమశక్తి సంఘాల పేరుతో ఫాంపాండ్, తవ్వినట్టుగా రికార్డుల్లో చూపించి, పొక్లెయిన్లతో తవ్వించేయడానికి మార్గం వేసింది. దీనివల్ల పనులు దొరక్క తాము పస్తులుండాల్సిన పరిస్థితులు దాపురిస్తాయని వారు ఆందోళన చెందుతున్నారు.