ట్రిపుల్‌ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు

Published Sun, Apr 27 2025 12:51 AM | Last Updated on Sun, Apr 27 2025 12:51 AM

ట్రిప

ట్రిపుల్‌ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు

వేంపల్లె : రాజీవ్‌ గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జ్‌ అండ్‌ టెక్నాలజీ(ఆర్జీయూకేటీ)లో 2025–26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఇంజినీరింగ్‌ ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ఒక్కో ట్రిపుల్‌ ఐటీకి 1000 సీట్ల చొప్పున 4వేల సీట్లను ఆర్జీ యూకేటీ అధికారులు కేటాయించారు. అలాగే ఈబీసీ కోటా కింద ఒక్కో ట్రిపుల్‌ ఐటీకి 100 సీట్ల చొప్పున 400 సీట్లను కేటాయించారు. 2024–25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల చూపంతా ట్రిపుల్‌ ఐటీ వైపు మళ్లింది. ఈ నెల 24వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కాగా.. ఈ నెల 27వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. మే 20వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఎంపికై న అభ్యర్థుల జాబితా జూన్‌ 6న విడుదల చేస్తారు. జూన్‌ 11 నుంచి 17 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిర్వహిస్తారు. స్పెషల్‌ కేటగిరి (పీహెచ్‌సీ/ క్యాప్‌/ఎన్‌సీసీ/స్పోర్ట్స్‌/భారత్‌ స్కౌట్స్‌) కోటా అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను మే 28 నుంచి 31వ తేదీ వరకు నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో నిర్వహిస్తారు. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన అనంతరం జూలై మొదటి వారంలో తరగతులు ప్రారంభించే అవకాశం ఉంది.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అత్యున్నత సాంకేతిక విద్యను అందించేందుకు 2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి ఇడుపులపాయ, నూజివీడు, తెలంగాణా రాష్ట్రంలోని బాసరలో ట్రిపుల్‌ ఐటీలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో ఒక్కోదానికి 2000 సీట్లను కేటాయించగా.. తర్వాత ప్రభుత్వాలు 2010లో ఒక ట్రిపుల్‌ ఐటీలో 1000 సీట్లు ఉండేలా కుదించారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం బాసర ట్రిపుల్‌ ఐటీ తెలంగాణకు వెళ్లిపోవడంతో 2016లో ఏపీలో ఒంగోలు, శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీలను ప్రారంభించారు. వీటిలో 26 జిల్లాల విద్యార్థులకు సమానంగా సీట్లు ఇవ్వాలని యూనివర్సిటీ అధికారులు నిర్ణయించారు. 4000 సీట్లలో ఓపెన్‌ కేటగిరిలో 600 సీట్లను స్థానికేతరులు, తెలంగాణ ఎన్‌ఆర్‌ఐ, తదితరులకు కేటాయిస్తారు. మిగిలిన 3400 సీట్లను 26 జిల్లాల వారికి సమానంగా పంచుతారు. జిల్లాకు కేటాయించే సీట్ల ఆధారంగా మెరిట్‌ విద్యార్థులకు అవకాశం లభించనుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థులకే ట్రిపుల్‌ ఐటీల్లో అధిక సీట్లు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికే ఈ అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఎంపిక ప్రక్రియ ఇలా

ఎంపిక ప్రక్రియలో భాగంగా ఇద్దరు విద్యార్థులకు సమాన మార్కులు వస్తే తొలుత గణితం అనంతరం జనరల్‌ సైన్స్‌ తర్వాత ఇంగ్లీషు, సోషల్‌ స్టడీస్‌, ఫస్ట్‌ లాంగ్వేజ్‌లో అధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. అప్పటికి సమానంగా వస్తే పుట్టిన తేదీ ప్రకారం అధిక వయస్సు ఉన్న వారిని హాల్‌ టికెట్‌ నెంబర్‌ నుంచి పొందిన అత్యల్ప సంఖ్య ఆధారంగా ఎంపిక చేస్తారు.

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు..

ట్రిపుల్‌ ఐటీలలో చేరేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు గిగిగి. ఖఎ్ఖఓఖీ. ఐూ. అ్క వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఓసీ విద్యార్థులకు దరఖాస్తు రుసుము రూ.300లు కాగా, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.200లుగా నిర్ణయించారు.

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌

ట్రిపుల్‌ ఐటీలో అడ్మిషన్లకు రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ను పాటిస్తారు. రాష్ట్రంలోని అభ్యర్థులకు 85 శాతం సీట్లు, మిగిలిన 15 శాతం సీట్లు రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు కేటాయిస్తారు. అడ్మిషన్లలో కచ్చితంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ పాటిస్తారు. ఎస్సీ–15 శాతం, అనగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌–2 ప్రకారం ఎస్సీ గ్రూపు–1 కి 1 శాతం, గ్రూప్‌– 2 కి 6.5 శాతం, గ్రూప్‌ –3 కి 7.5 శాతం ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. మిగిలిన కేటగిరీలో ఎస్టీ–6, బీసీ(ఏ)–7, బీసీ(బి)–10, బీసీ (సి)1, బీసీ (డి)7, బీసీ(ఈ) 4, దివ్యాంగులకు–5 శాతం ప్రకారం సీట్లను భర్తీ చేస్తారు. ఆర్మీ ఉద్యోగుల పిల్లలు (సీఏపీ)–2, ఎన్‌సీసీ–1, స్పోర్ట్స్‌–0.5, భారత్‌ స్కౌట్స్‌ ఆఫ్‌ గైడ్స్‌–0.5 శాతం సీట్లు కేటాయిస్తారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కేటగిరిలో బాలికలకు 33.1/3 శాతం సీట్లు కేటాయిస్తారు.

మొత్తం 4400 సీట్లు

రాష్ట్రంలోని ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీల్లో ఒక్కో క్యాంపస్‌కు 1000 సీట్ల చొప్పున మొత్తం 4వేల సీట్లు ఉన్నాయి. అదేవిధంగా ఈబీసీ కోటా కింద ఒక్కో క్యాంపస్‌కు 100 సీట్ల చొప్పున 400 సీట్లు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్‌ రాష్ట్ర ప్రభుత్వం గురువారం విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 2024–25 విద్యా సంవత్సరంలో జరిగిన 10వ తరగతి పరీక్షల్లో 6,14,459 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, అందులో 4,98,585 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 2,45,307 మంది, బాలికలు 2,53,278 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈ ఏడాది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య అధికంగా ఉండడంతో గట్టి పోటీనే ఉంటుందని పలువురు భావిస్తున్నారు.

అన్ని జిల్లాలకు సమానంగా సీట్లు

ఆర్జీయూకేటీ పరిధిలోని అన్ని ట్రిపుల్‌ ఐటీల్లో ఆయా జిల్లాల్లో సమానంగా సీట్లు కేటాయిస్తాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు 4శాతం, డిప్రివేషన్‌ స్కోరును జోడించి మెరిట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తాం. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.

– ప్రొఫెసర్‌ అమరేంద్ర కుమార్‌ సండ్ర(ఆర్జీయూకేటీ అడ్మిషన్స్‌ కన్వీనర్‌), ఇడుపులపాయ

ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదల

నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

పదవ తరగతి మార్కుల ఆధారంగా విద్యార్థుల ఎంపిక

2008లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరెడ్డి హయాంలో

ట్రిపుల్‌ ఐటీల ఏర్పాటు

ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు నాలుగు శాతం డిప్రివేషన్‌ స్కోరును జోడించి అభ్యర్థుల ఎంపిక

ట్రిపుల్‌ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు1
1/1

ట్రిపుల్‌ ఐటీలతో.. ఉజ్వల భవిష్యత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement