
గొప్ప ఆర్థికతత్వవేత్త
డాక్టర్ బీఆర్.అంబేడ్కర్
బాపట్ల: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గొప్ప ఆర్థికతత్వవేత్తగా ఎదిగి భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించారని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక కలెక్టరేట్ ఆవరణలో సభ నిర్వహించారు. అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థినీలు జై భీమ్,... జై భీమ్ అంబేడ్కర్ అంటూ... కోలాట నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యనభ్యసించి బైపీసీలో 975 మార్కులు సాధించిన చీరాల విద్యార్థినీ కె ధాత్రి, ఎంపీసీలో 975 మార్కులు సాధించిన పర్చూరుకి చెందిన విద్యార్థిని సమీరాలకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున నగదు బహుమతులను కలెక్టర్ అందజేశారు. ఇటీవల యాజిలి గ్రామంలోని నీటి కుంటలో పడి మృతి చెందిన ఎస్సీ బాలుడు జి ప్రవీణ్ తల్లి అమృతకు కలెక్టర్ రూ.10వేల చెక్కు అందించారు. ఎంపీ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ సామాజిక, ఆర్థిక సాధికారతతోనే సమానత్వం లభిస్తుందని ఉద్యమాలు చేసిన గొప్ప నాయకుడు అంబేడ్కర్ అన్నారు. సమానత్వం కోసం రాజ్యాంగంతో చట్టాలు రూపొందించారని పేర్కొన్నారు. ఎన్నో ఒత్తిళ్లు వచ్చినప్పటికీ రిజర్వేషన్లు సాధించి పెట్టారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి మాట్లాడుతూ పేదరికం, అంటరానితనాన్ని ధైర్యంగా ఎదుర్కొన్న డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విద్యతో మేధావిగా చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారని తెలిపారు. మట్టిలో మాణిక్యం, ఆణిముత్యంలా... సమాజానికి దిక్సూచిలా మారారన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ సామ్యవాదంతో ప్రపంచ మార్గదర్శకుడిగా అంబేడ్కర్ నిలిచారని అన్నారు. చిన్నతనంలోనే అంబేడ్కర్ అస్పృశ్యతపై ఉద్యమించారన్నారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మరాజు, బుడా చైర్మన్ సలగల రాజశేఖర్‌బాబు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిని రాజా దెబోరా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ విజయమ్మ, డీపీఓ ప్రభాకర్, ఆర్డీవో పి గ్లోరియా, ఎస్సీ నాయకులు జి.చార్వాక, మాణిక్యరావు, లక్ష్మీనరసయ్య, పల్నాడు శ్రీరాములు, ఎస్టీ నాయకులు ఎన్ మోహన్‌కుమార్ ధర్మ, తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు