
‘సీతారామ’పై నజర్
పర్యావరణ అనుమతులపై దృష్టి సారించిన అధికారులు
● 15 నెలలుగా పెండింగ్‌లోనే ఈసీ ఫైల్ ● ఈసీ వస్తేనే పనులు చేపట్టాలని ఎన్‌జీటీ ఆదేశాలు ● ఇటీవలే సీతారామకు టీఏసీ నుంచి గ్రీన్ సిగ్నల్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాగు భూములకు గోదావరి జలాలు అందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీతారామ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టింది. అందులో భాగంగా సీతమ్మ సాగర్ పేరుతో గోదావరిపై బరాజ్ నిర్మిస్తోంది. ఈ మేరకు పర్యావరణ అనుమతుల కోసం 2018లో కేంద్ర పర్యావరణ శాఖకు దరఖాస్తు చేసింది. ఆ వెంటనే వివిధ ప్యాకేజీలుగా ప్రాజెక్టు పనులను విభజించి నిర్మాణ పనులు ప్రారంభించింది. కేంద్రం నుంచి పర్యావరణ అనుమతులు రాకుండానే సీతమ్మ సాగర్ బరాజ్ నిర్మిస్తున్నారని, గోదావరి బ్యాక్ వాటర్ కారణంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాలు, పొలాలు, అడవులు మునిగిపోతాయంటూ భద్రాచలం ఏజెన్సీకి చెందిన కొందరు వ్యక్తులు 2022 డిసెంబరులో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ), చైన్నె బెంచ్‌ను ఆశ్రయించారు. దీంతో పర్యావరణంతోపాటు అన్ని రకాల అనుమతులు వచ్చే వరకు ప్రాజెక్టు పనులు ఆపాలంటూ 2022 ఏప్రిల్ 26న ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్‌జీటీ ఆగ్రహం
గ్రీన్ ట్రిబ్యునల్‌లో వివాదం కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై సీతమ్మసాగర్ బరాజ్ నిర్మాణ పనులు శరవేగంగా చేపట్టింది. దుమ్ముగూడెం, అశ్వాపురంల మధ్య గోదావరి నదిపై 1.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. జల విద్యుత్ కేంద్ర నిర్మాణం కోసం కుడివైపున గట్టు నుంచి 200 మీటర్లు వదిలిపెట్టి, మిగిలిన 1.3 కి.మీ పొడవుతో మొత్తం ఆరు బ్లాకులుగా విభజించి నిర్మాణ పనులు ప్రారంభించారు. ఇందులో ఒకటి నుంచి నాలుగు బ్లాకుల్లో పియర్లు, స్పిల్‌వేల నిర్మాణం పూర్తయింది. క్రస్ట్ గేట్లు బిగించడమే తరువాయి అనుకునే తరుణంలో గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలను పట్టించుకోకుండా బ్యారేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయంటూ మరోసారి ఎన్‌జీటీని బాధితులు ఆశ్రయించారు. బరాజ్ నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యాలను ఫొటోలతో సహా సమర్పించారు. దీంతో ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్కడిపనులు అక్కడే ఆపాలంటూ 2023 మే 29న ఆదేశాలు జారీ చేసింది.
క్షేత్రస్థాయి పరిశీలనకు ద్విసభ్య కమిటీ
క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ ఎన్‌జీటీ ద్విసభ్య కమిటీని నియమించింది. మినిస్టరీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖకు చెందిన రీజినల్ డైరెక్టర్ (హైదరాబాద్), గోదావరి నదీ జలాల నిర్వాహణ బోర్డులో ఎస్‌ఈ స్థాయి అధికారి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. కమిటీ 2023 జూన్‌లో క్షేత్రస్థాయిలో పర్యటించి, జూలైలో నివేదిక అందించింది. అయితే నివేదిక లోపభూయిష్టంగా ఉందంటూ ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పని ప్రదేశంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ సూచన చేసింది. పదేపదే తమ ఆదేశాలు ధిక్కరిస్తూ అనుమతులు లేకుండా పనులు చేపట్టడంపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ గోదావరి రివర్‌బోర్డు మేనేజ్‌మెంట్, కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖలను ఇటీవల ఆదేశించింది. దీనిపై 2023 సెప్టెంబరు 23న ఎన్‌జీటీలో వాదనలు జరిగాయి. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన రావడంతో ఈ అంశం మరుగున పడింది.
డీపీఆర్‌కు లైన్ క్లియర్
అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణ వ్యయం, అనుమతులపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించింది. ముందుగా సీతారామకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు, డీపీఆర్)కి కూడా ఎకనామిక్ ఫీజుబులిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అనుమతులు లేని విషయాన్ని గుర్తించింది. దీంతో ముందుగా ఈ రెండు అనుమతులు సాధించడంపై దృష్టి పెట్టింది. 2024 ఆగస్టులో ఈ ప్రయత్నాలు మొదలైతే 2025 ఏప్రిల్ 24న డీపీఆర్‌కు టీఏసీ అనుమతులు కూడా వచ్చాయి.
ఈసీపై దృష్టి
ఇప్పుడు కీలకమైన పర్యావరణ అనుమతు (ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్)లు సాధించడంపై దృష్టి సారించాల్సి ఉంది. అందులో భాగంగా నిర్వాసితుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని, ఆ మేరకు చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. అనంతరం గ్రీన్ ట్రిబ్యునల్‌లో వాదనలు వినిపించి, ఈసీ క్లియరెన్స్ వచ్చాక, అపెక్స్ కమిటీ నుంచి మిగిలిన అనుమతులు సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే బరాజ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశముంది.