
భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ (Bharat Biotech) సహ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్ కృష్ణ ఎల్లా (Dr Krishna Ella) ప్రతిష్టాత్మక గుర్తింపు పొందారు. 2025 సంవత్సరానికి గాను ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ (INSA) ప్రతిష్టాత్మకమైన ఇండియా ఫెలోషిప్ ప్రకటించింది.
కొత్త విజ్ఞానం, ఆవిష్కరణలు, కొత్త వ్యాక్సిన్ టెక్నాలజీల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న సాంకేతికతల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఐఎన్‌ఎస్‌ఏ ఆయనకు ఈ ఫెలోషిప్ ప్రదానం చేసింది. దీంతో ఈ గౌరవం అందుకున్న విశిష్ట శాస్త్రవేత్తలు, పరిశ్రమల ప్రముఖుల జాబితాలో డాక్టర్ ఎల్లా కూడా చేరారు.
ఇందులో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ కకోద్కర్, డీఆర్‌డీఓ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ వీకే సరస్వత్, ఇస్రో ఛైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు క్రిస్ గోపాలకృష్ణన్, డీడీఆర్&డీ కార్యదర్శి సమీర్ వి కామత్, డీఆర్‌డీఓ చైర్మన్ డా. కేఎన్ శివరాజన్ వంటివారు ఉన్నారు.
ఈ సంవత్సరం మొత్తం 61 ఫెలోషిప్‌లు అందించగా మొట్టమొదటిసారిగా పరిశ్రమ నాయకులకు ఫెలోషిప్‌లు అందించారు. ఎంపికైన సభ్యులు ఐఎన్‌ఎస్‌ఏ సాధారణ సమావేశాలకు హాజరై ఓటు వేయవచ్చు. ఫెలోషిప్‌లు లేదా ఐఎన్‌ఎస్‌ఏ అవార్డుల కోసం ఇతర వ్యక్తులను ప్రతిపాదించవచ్చు.
“వ్యాక్సిన్‌లు, బయోటెక్నాలజీ రంగంలో నా సహకారాన్ని గుర్తించినందుకు ఐఎన్‌ఎస్‌ఏకు కృతజ్ఞతలు. ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, కొత్త వ్యాక్సిన్‌లను కనుగొనడంలో భారత్ ఆధిపత్య శక్తిగా ఎదగడానికి నా మద్దతును మరింత కొనసాగిస్తాను” అని డాక్టర్ కృష్ణ ఎల్లా అన్నారు.