
పాత కార్ల కొనుగోలు, అమ్మకానికి వేదికగా ఉన్న ‘కార్స్ 24’ సంస్థ ఇటీవల 200 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించింది. కంపెనీ కార్యకలాపాలను పునర్నిర్మించడానికి ఉద్దేశించిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగాయని సంస్థ సహ వ్యవస్థాపకులు, సీఈఓ విక్రమ్ చోప్రా ఉద్యోగులకు అంతర్గత నోట్‌లో స్పష్టం చేశారు. ఈ తొలగింపులు నిరంతర లేఆఫ్స్ ప్రక్రియకు ప్రారంభం కాదని, కంపెనీ దీర్ఘకాలిక లక్ష్యాలకు అవసరమైన చర్యగా ఆయన ఉద్యోగులకు హామీ ఇచ్చారు. కార్స్24 సంస్థలో ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీకి వాటాలుండడం గమనార్హం.
కఠినంగా నియామకాలు
కార్స్24 మరింత కఠినమైన విధానాన్ని అనుసరిస్తూ నియామకాల ప్రక్రియ చేపడుతుందని చోప్రా నొక్కి చెప్పారు. ప్రస్తుత లేఆఫ్స్ కంపెనీ వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్దుబాటు చేసేందుకు తోడ్పడుతాయని తెలిపారు. కార్స్ 24 కొత్త వ్యాపార విభాగాలకు విస్తరిస్తున్న సమయంలో ఈ తొలగింపులు జరిగాయి. కంపెనీ తన ప్లాట్‌ఫామ్ సామర్థ్యాలను పెంచడానికి, ఆటోమోటివ్ కమ్యూనిటీని బలోపేతం చేయడానికి దేశపు అతిపెద్ద ఆటోమోటివ్ ఫోరమ్ ‘టీమ్-బీహెచ్‌పీ’ని ఇటీవల కొనుగోలు చేసింది. అదనంగా, కార్స్ 24 వాహన మరమ్మతులు, ఫైనాన్సింగ్, బీమాతో సహా కొత్త కార్ల అమ్మకాలు, అనుబంధ సేవల కోసం ఆన్‌లైన్ సర్వీసులను ప్రారంభించింది.
ఇదీ చదవండి: లేటరల్ ఎంట్రీ నియామకాలకు నోటిఫికేషన్
ఆర్థిక పనితీరు, వ్యూహాత్మక సర్దుబాట్లు
కార్స్ 24 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.498 కోట్ల నికర నష్టాన్ని నివేదించింది. ఇది వ్యూహాత్మక సర్దుబాట్ల అవసరాన్ని ఎత్తిచూపింది. యూనిట్ల అమ్మకాలు, సగటు అమ్మకపు ధరల పెరుగుదలతో కంపెనీ నిర్వహణ ఆదాయం 25 శాతం పెరిగి రూ.6,917 కోట్లకు చేరుకుంది. దాంతో కంపెనీ వ్యయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది.