
ట్రేడ్ వార్.. మార్కెట్ టెర్రర్
ట్రంప్ టారిఫ్‌ల దెబ్బకు కుదేలైన స్టాక్ మార్కెట్లు..
ఆసియా, యూరప్ మార్కెట్లన్నీ భారీ పతనం
వాటికన్నా తక్కువ నష్టంలోనే భారత మార్కెట్లు..
మన ఆటో, టెక్స్‌టైల్, జ్యుయలరీ రంగాలపై తీవ్ర ప్రభావం
ఫార్మా, ఎనర్జీ రంగాలకు మినహాయింపు
నా ఆపరేషన్ సక్సెస్: ట్రంప్
ఈ ఊరికి ఆ ఊరెంతో... ఆ ఊరికి ఈ ఊరూ అంతే!. వస్తూనే దీన్ని ఆలాపించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఇప్పుడు ఆచరించేశారు. అమెరికా వస్తువులపై ప్రపంచ దేశాలన్నీ భారీ సుంకాలు విధిస్తున్నాయి కనక... తామెందుకు తగ్గాలంటూ... ఇండియా సహా ఏ దేశాన్నీ వదలకుండా సుంకాల సమ్మెటతో చితక్కొట్టేశారు.
అన్ని దేశాలకూ అమెరికా అతి పెద్ద మార్కెట్ కావటంతో... కంపెనీల లాభాలపై ప్రభావం పడి, వ్యాపారం తగ్గుతుందనే భయాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లన్నీ కుదేలయ్యాయి. ఒకరకంగా భార త మార్కెట్లు తక్కువే నష్టపోయాయి. మొదట మిగతా మార్కెట్లలాగే భారీ పతనంతో మొదలైనా... చివరకు కాస్త కోలుకున్నాయి.
అమెరికాకు భారత్ నుంచి ఎక్కువ ఎగుమతయ్యేవి సాఫ్ట్‌వేర్ సేవలు, మందులే. సుంకాల దెబ్బ నుంచి ఫార్మాను మినహాయించారు. ఇక సాఫ్ట్‌వేర్ సేవలపై టారిఫ్‌లు లేకున్నా... ట్రంప్ చర్యలతో అమెరికా మాంద్యంలోకి జారే అవకాశాలున్నాయని, కంపెనీలు టెక్నాలజీపై వ్యయాలూ తగ్గించుకుంటాయనే అంచనాలు వస్తున్నాయి. అందుకే భారత ఐటీ షేర్లు భారీగా పతనం కాగా.. అమెరికాలో టెక్నాలజీ కంపెనీల సూచీ అయిన నాస్‌డాక్ అనూహ్యంగా 5 శాతానికిపైగా పతనమయింది.
ఆటో, టెక్స్‌టైల్, రత్నాలు– ఆభరణాల రంగాలపై ఈ సుంకాలు తీవ్ర ప్రభావాన్నే చూపించవచ్చు. ఎందుకంటే దేశం నుంచి అమెరికాకు వీటి ఎగుమతులు గణనీయంగా ఉన్నాయి. కాకపోతే టెక్స్‌టైల్, దుస్తులపై భారత్ కన్నా చైనాపై ట్రంప్ ఎక్కువ సుంకాలు విధించారు. దీంతో చైనాతో పోలిస్తే మన దుస్తులు తక్కువ ధరకు విక్రయించే అవకాశం ఉంటుంది కనక మన కంపెనీలు లాభపడతాయనే అంచనాలున్నాయి.
ముంబై: అమెరికాతో వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 60 దేశాలపై డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాల విధింపుతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు వణికిపోయాయి. ఏ దేశంపై ఎంత టారిఫ్‌ల విధింపు ఉంటుందో అని లెక్కలతో సహా ట్రంప్ వివరణతో ఆసియా నుంచి అమెరికా వరకు ఈక్విటీ మార్కెట్లు ‘బేర్’మన్నాయి. ప్రతీకార సుంకాలతో వాణిజ్య యుద్ధం తీవ్రతరమై అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటాయనే భయాలు అధికమయ్యాయి. ప్రపంచ దేశాలపై ట్రంప్ వాణిజ్య యుద్ధ ప్రభావం ఈక్విటీ మార్కెట్‌ను కుదిపేసింది.
→ ఆసియాలో జపాన్ నికాయ్ 3% క్షీణించింది. హాంగ్‌కాంగ్ సూచీ 1.50%, థాయ్‌లాండ్, దక్షిణ కొరియా ఇండెక్స్‌లు 1%, సింగపూర్ సూచీ అరశాతం చొప్పున నష్టపోయాయి.
→ యూరోపియన్ యూనియన్‌పై 20% సుంకాల విధింపుతో యూరప్ మార్కెట్లు సైతం కుప్పుకూలాయి. ఫ్రాన్స్ ఇండెక్స్ సీఏసీ 3.50%, జర్మనీ సూచీ డాక్స్ 3%, బ్రిటన్ ఇండెక్స్ ఎఫ్‌టీఎస్‌ఈ 1.50% నష్టపోయాయి.
దలాల్ స్ట్రీట్ అరశాతం డౌన్...
భారత ఈక్విటీ మార్కెట్ అరశాతం నష్టపోయింది. ఐటీ, ఆటో షేర్లలో అమ్మకాలు ఒత్తిడికి లోనయ్యాయి. సెన్సెక్స్ 322 పాయింట్లు నష్టపోయి 76,295 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 82 పాయింట్లు పతనమై 23,250 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ ప్రారంభమైన క్షణాల్లో సెన్సెక్స్ 809 పాయింట్లు క్షీణించి 75,808 వద్ద, నిఫ్టీ 187 పతనమై 23,145 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. ఫార్మాతో పాటు కొన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాల నుంచి కోలుకోగలిగాయి.
→ ప్రతీకార సుంకాల నుంచి ఫార్మా ఉత్పత్తులను మినహాయించడంతో ఫార్మా షేర్లకు డిమాండ్ నెలకొంది. జుబిలెంట్ ఫార్మోవా 7%, ఇప్కా ల్యాబ్స్ 5%, లుపిన్ 4%, సన్‌ఫార్మా 3% లాభపడ్డాయి. సిప్లా 2.50%, దివీస్ ల్యాబ్స్, గ్లెన్‌మార్క్ ఫార్మా 2%, అరబిందో ఫార్మా 1.50% పెరిగాయి.
→ అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్లిపోవచ్చనే భయాలతో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. పెర్సిస్టెంట్ 10%, కోఫోర్జ్, కేపీఐటీ 8%, టీసీఎస్, టెక్ మహీంద్రా 4% పతనమయ్యాయి. హెచ్‌సీఎల్ టెక్, ఇన్ఫోసిస్ 3.50%, విప్రో 3% నష్టపోయాయి.
→ ఆరంభ నష్టాలు భర్తీ చేసుకున్న రూపాయి డాలర్ మారకంలో 22 పైసలు పెరిగి 85.30 వద్ద స్థిరపడింది.
వాల్‌స్ట్రీట్ విలవిల
ట్రంప్ ప్రతీకార సుంకాల ప్రకటన ప్రభావం అమెరికా ఈక్విటీ మార్కెట్లనూ వెంటాడింది. ఇప్పటికే ద్రవ్యోల్బణంతో వినిమయం తగ్గిన నేపథ్యంలో తాజా టారిఫ్‌లతో పరిస్థితులు మరింత దిగజారి ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి వెళ్తున్న భయాలు నెలకొన్నాయి. డోజోన్స్ సూచీ 1,118 పాయింట్లు క్షీణించి 41,047 వద్ద స్థిరపడింది. ఒకానొక దశలో 1500 పాయింట్ల పతమైంది. నాస్‌డాక్ 4% ఎస్‌అండ్‌పీ 3.50 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లో చిన్న కంపెనీల షేర్లకు ప్రాతినిధ్యం వహించే రస్సెల్స్ 2000 ఇండెక్స్ 5% క్షీణించింది. అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.65 ట్రిలియన్ డాలర్లు హరించుకుపోయింది.
→ ఐఫోన్లకు ప్రధాన సప్లయర్‌గా ఉన్న చైనాపై అమెరికా భారీ సుంకాలు విధించడంతో సప్లయ్ చైన్‌కు అవరోధం ఏర్పడుతుందన్న ఆందోళనలతో యాపిల్ షేర్లు 9 శాతం మేర నష్టాల్లో ట్రేడవుతున్నాయి. షేరు భారీ పతనంతో కంపెనీ విలువ 250 బిలియన్ డాలర్లు పడిపోయింది. 2020 తర్వాత యాపిల్ స్టాక్ ఈ స్థాయిలోపతనం కావడం ఇదే తొలిసారి. వీటితో పాటు అమెజాన్ 6%, ఎన్విడియా 5%, టెస్లా 4.50% గూగుల్ 3%, మెటా 6%, మైక్రోసాఫ్ట్ 2% నష్టపోయాయి.
కమోడిటీలకూ సెగ
పసిడి, వెండి ధరల పతనం
చల్లబడిన చమురు ధరలు
పలు దేశాలపై ట్రంప్ తెరతీసిన టారిఫ్‌లతో కమోడిటీలకు సైతం సెగ తగులుతోంది. దీంతో ఇటీవల తళతళ మెరుస్తున్న పసిడి, వెండి ధరలు ఒక్కసారిగా కరగడం మొదలైంది. ముడిచమురు ధరలు సైతం భారీగా చల్లబడ్డాయి. న్యూయార్క్ కామెక్స్‌లో పసిడి ఔన్స్(31.1 గ్రాములు) 40 డాలర్లు(1.3 శాతం) క్షీణించి 3,126 డాలర్లకు చేరింది. ఒకదశలో 3,198 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్టాన్ని తాకి, తర్వాత 3,074 డాలర్ల వరకూ పతనమైంది.
ఈ బాటలో వెండి మరింత అధికంగా ఔన్స్ 2.66 డాలర్లు(7.7 శాతం) కుప్పకూలింది. 31.9 డాలర్ల వద్ద కదులుతోంది. బ్రెంట్ చమురు బ్యారల్ 6.8% పతనమై 69.8 డాలర్లను తాకింది. న్యూయార్క్‌లో నైమెక్స్ చమురు బ్యారల్ 7%పైగా పడిపోయి 66.65 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ట్రంప్ టారిఫ్‌లతో యూఎస్ జీడీపీపై 2025 రెండో క్వార్టర్(ఏప్రిల్–జూన్)లో 10 శాతం ప్రతికూల ప్రభావం పడే వీలున్నట్లు ఆర్థికవేత్తలు అంచనా వేయడం స్టాక్స్, కమోడిటీలలో భారీ అమ్మకాలకు కారణమైనట్లు విశ్లేషకులు తెలియజేశారు.