
పరిమాణం అంతే ఉండొచ్చు
మార్కెట్లో సానుకూల సెంటిమెంట్
అక్షయ తృతీయ, పెళ్లిళ్లు అనుకూలం
జ్యుయలర్లు, క్రిసిల్ అభిప్రాయాలు
ముంబై: బంగారం ధరలు గణనీయంగా పెరిగిపోవడం వినియోగ డిమాండ్‌ను దెబ్బతీయొచ్చని పరిశ్రమ వర్గాలు, రేటింగ్ ఏజెన్సీలు భావిస్తున్నాయి. అయినప్పటికీ ఈ నెల 30న అక్షయ తృతీయ, తదుపరి మే చివరి వరకు వివాహాల సీజన్ నేపథ్యంలో కొనుగోళ్ల సెంటిమెంట్ సానుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ నెల 22న బంగారం 10 గ్రాములకు ఢిల్లీలో రూ.1,01,350కు పెరిగిపోవడం తెలిసిందే. ‘‘బంగారం ధరలు అనూహ్యంగా పెరగడం అన్నది డిమాండ్‌పై కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఈ షాక్ నుంచి తేరుకున్న తర్వాత డిమాండ్ స్థిరపడుతుంది. మొత్తం మీద అయితే మార్కెట్లో సానుకూల సెంటిమెంట్ ఉంది. అక్షయ తృతీయ, వివాహాల సీజన్ నేపథ్యంలో వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నాం’’ అని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోక్డే తెలిపారు.
2023లో 741 టన్నుల బంగారం దిగుమతి కాగా, ధరలు 20% మేర పెరిగినప్పటికీ 2024లో 802 టన్నులు దిగుమతి కావడాన్ని ఆయన ప్రస్తావించారు. బంగారం ధర రూ.లక్షకు చేరడం కచ్చితంగా డిమాండ్‌పై 10–15% ప్రభావం ఉండొచ్చని ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యుయలరీ డొమెస్టిక్ కౌన్సిల్ వైస్ చైర్మన్ అవినాష్ గుప్తా చెప్పారు.
ఒత్తిడి ఉన్నప్పటికీ..
‘‘మార్కెట్లో ఆశావహ వాతావరణం కనిపిస్తోంది. బంగారం ధరలు భవిష్యత్తులో ఇంకా పెరుగుతాయన్న అంచనాలు నెలకొన్నాయి. కొంతకాలంగా ధరలు పెరుగుదలతో అమ్మకాల పరిమాణంపై ఒత్తిడి నెలకొంది. అయినప్పటికీ వినియోగదారుల్లో ఉన్న సానుకూల సెంటిమెంట్ పరిశ్రమకు అనుకూలిస్తుంది’’ అని పీఎన్ గాడ్గిల్ జ్యుయలర్స్ చైర్మన్ సౌరభ్ గాడ్గిల్ తెలిపారు.
విక్రయాలు 9–11 శాతం తగ్గొచ్చు..
బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టాలకు చేరినందున ఈ ఏడాది (2025–26) సంస్థాగత రిటైల్ జ్యుయలర్ల అమ్మకాలు (పరిమాణం పరంగా) 9–11% వరకు తగ్గొచ్చని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. అధిక ధరల కారణంగా వినియోగదారులు తక్కువ పరిమాణంలో కొనుగోళ్లకు మొగ్గు చూపించొచ్చని పేర్కొంది. కొనుగోలు వ్యయం అంతే ఉండి, క్యారట్, గ్రాముల రూపంలో తగ్గొచ్చని వివరించింది. అయినప్పటికీ అమ్మకాల ఆదాయం క్రితం ఆర్థిక సంవత్సరం కంటే 13–15% పెరగొచ్చని తాజా నివేదికలో తెలిపింది.
రూ.లక్ష దిగువకు పసిడి
బంగారం ధర రూ.లక్షను దాటిన ఒక్కరోజులోనే అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాములకు (99.9 శాతం స్వచ్ఛత) రూ.2,400 నష్టపోయింది. రూ.99,200 వద్ద స్థిరపడింది. 99.5% స్వచ్ఛత బంగారం రూ.3,400 నష్టపోయి రూ.98,700కు దిగొచ్చింది. చైనాపై విధించిన టారిఫ్‌లు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని త్వరలోనే తగ్గించనున్నట్టు ట్రంప్ ప్రకటించడం అమ్మకాలకు దారితీసింది.