
Google Badges: మనకు ఏ సమాచారం కావాలన్నా వెంటనే గూగుల్ చేసేస్తాం. అలా సెర్చ్ చేసేటప్పుడు ఒక్కోసారి ఫేక్ వెబ్‌సైట్ కూడా దర్శనమిస్తుంటాయి. తెలియనివారు వీటితో నష్టపోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో యూజర్ల భద్రత కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది.
ఫేస్‌బుక్, వాట్సాప్, ‘ఎక్స్’ (ట్విటర్) వంటి వాటిలో ప్రసిద్ధమైన వెరిఫికేషన్ బ్యాడ్జ్‌లను గూగుల్ కూడా తీసుకొచ్చే పనిలో ఉంది. ఈ ఫీచర్ ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది. గూగుల్ సెర్చ్ ఫలితాల్లో ఇప్పటికే ఈ తేడాను చూడవచ్చు. అధికారిక మెటా, మైక్రోసాఫ్ట్, యాపిల్ వెబ్‌సైట్‌లకు లింక్‌ల పక్కన బ్లూ కలర్
వెరిఫైడ్ బ్యాడ్జ్ కనిపిస్తుంది.
ప్రముఖ కంపెనీల అధికారిక ఖాతాలను గుర్తించేందుకు కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ధ్రువీకరణ చిహ్నాలు (Google Badges) ఇప్పుడు కొన్ని పరిశ్రమలలోని ప్రముఖ కంపెనీల వెబ్ అడ్రస్ పక్కన కనిపిస్తాయి. దీంతో ఫేక్ వెబ్‌సైట్‌లను యూజర్లు సులభంగా గుర్తించగలరు. ఇందుకోసం ఆటోమేటెడ్ సిస్టమ్స్‌ను ఉపయోగిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.