
టెక్ దిగ్గజం యాపిల్ యాప్ స్టోర్ ద్వారా గతేడాది రూ.44,447 కోట్ల విలువ చేసే డెవలపర్ల బిల్లింగులు, విక్రయాలు (ఉత్పత్తులు, సేవలు) నమోదయ్యాయి. యాపిల్‌కి కమీషన్లులాంటివి లేకుండా ఇందులో 94 శాతం భాగం నేరుగా డెవలపర్లు, వ్యాపార సంస్థలకే లభించింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (అహ్మదాబాద్)కి చెందిన ప్రొఫెసర్ విశ్వనాథ్ పింగళి నిర్వహించిన అధ్యయన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
నివేదికలోని అంశాల ప్రకారం గత అయిదేళ్లలో భారతీయ డెవలపర్లకు అంతర్జాతీయంగా వచ్చే ఆదాయాలు రెట్టింపయ్యాయి. ఫుడ్ డెలివరీ, ట్రావెల్, గేమింగ్, ఎంటర్టైన్మెంట్ తదితర రంగాలకు చెందిన యాప్‌ల వినియోగం గణనీయంగా పెరిగింది. గతేడాది భారతీయ డెవలపర్ల ఆదాయాల్లో దాదాపు 80 శాతం వాటా ఇతర దేశాల్లోని యూజర్ల నుంచే వచ్చింది. ఏడాది పొడవున యాప్ స్టోర్ నుంచి 75.5 కోట్ల సార్లు మన డెవలపర్ల యాప్‌లను యూజర్లు డౌన్లోడ్ చేసుకున్నారు.
ఇదీ చదవండి: వ్యాపార ‘పద్మా’లు..
భారతదేశంలోని డెవలపర్ల సృజనాత్మకత, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడంలో యాప్ స్టోర్ కీలక పాత్ర పోషిస్తుంది. యాపిల్ వ్యాపార నమూనాలో ‘ఫ్రీ’మియం(ఉచితం) యాప్‌లు, పెయిడ్ యాప్‌లు, ఇన్-యాప్ పర్చేజ్లు లేదా సబ్స్క్రిప్షన్లతో కూడిన యాప్‌లు వంటి వివిధ మానిటైజేషన్ విధానాలు ఉన్నాయి. ఇది డెవలపర్లను వారి లక్ష్యాలకు అనుగుణంగా టార్గెటెడ్ ఆడియన్స్‌ను ఎంచుకునేందుకు వీలు కల్పిస్తుంది.