
న్యూఢిల్లీ: జీఎస్‌టీ కౌన్సిల్ భేటీ ఈ నెల 17న జరగనుంది. జీఎస్‌టీ నిబంధనల ఉల్లంఘనలను నేరాలుగా పరిగణించకపోవడం అన్నది ముఖ్యమైనది. అలాగే, జీఎస్‌టీ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఏర్పాటు, పాన్ మసాలా, గుట్కా కంపెనీల పన్ను ఎగవేతలు తదితర అంశాలు చర్చకు రానున్నాయి.
జీఎస్‌టీ కింద నిబంధనల ఉల్లంఘనలో ప్రాసిక్యూషన్ చేపట్టే వాటి ద్రవ్య పరిమితి (కేసు విలువ) మూడు రెట్లు పెంచాలని జీఎస్‌టీ కౌన్సిల్‌కు సంబంధించి న్యాయ కమిటీ సిఫారసు చేసింది. దీనిపై జీఎస్‌టీ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అలాగే, జీఎస్‌టీ ఉల్లంఘనలదారుల నుంచి వసూలు చేసే ఫీజును కూడా తగ్గించడాన్ని తేల్చనుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలపై పన్ను రేటు పెంపు అంశాన్ని ఈ విడత జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశం చర్చకు చేపట్టకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనిపై మంత్రుల బృందం ఇంకా నివేదిక సమర్పించాల్సి ఉందని పేర్కొన్నాయి.