
క్యూ4 లాభం నేలచూపు
2025–26 గైడెన్స్ అంతంతే
20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి
న్యూఢిల్లీ: గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ పనితీరు నిరాశ పరచింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 12 శాతం క్షీణించి రూ. 7,033 కోట్లకు పరిమితమైంది. 2023–24 ఇదే కాలంలో రూ. 7,969 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం మాత్రం 8 శాతం ఎగసి రూ. 40,925 కోట్లకు చేరింది. అంతక్రితం క్యూ4లో రూ. 37,923 కోట్ల టర్నోవర్ సాధించింది.
అయితే త్రైమాసికవారీగా(క్యూ3) చూస్తే నికర లాభం 3.3 శాతం పుంజుకోగా.. ఆదాయం 2 శాతం నీరసించింది. కాగా.. పూర్తి ఏడాదికి నికర లాభం 2 శాతం వృద్ధితో రూ. 26,713 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం 6 శాతం పెరిగి రూ. 1,62,990 కోట్లకు చేరింది. వెరసి గత ఆదాయ గైడెన్స్ 4.5–5 శాతాన్ని అధిగమించింది. అతిపెద్ద కాంట్రాక్ట్‌తో కలిపి గతేడాది 11.6 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు సాధించింది. వీటిలో 56 శాతం కొత్త ఆర్డర్లే!
అంచనాలు వీక్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో ఆదాయం 0–3 శాతం మధ్య బలపడే వీలున్నట్లు ఇన్ఫోసిస్ తాజాగా అంచనా వేసింది. నిలకడైన కరెన్సీ ప్రాతిపదికన గైడెన్స్ ప్రకటించింది. కాగా.. గతేడాది కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా 4.1 బిలియన్ డాలర్ల క్యాష్ ఫ్లో సాధించినట్లు ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో జయేష్ ఎస్. వెల్లడించారు. వాటాదారులకు షేరుకి రూ. 22 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.
ఇతర విశేషాలు...
→ 2025 మార్చికల్లా మొత్తం సిబ్బంది సంఖ్య 6,000 మంది పెరిగి 3,23,578కు చేరింది.
→ గతంలోప్రకటించినట్లు ఈ ఏడాది 20,000 మంది ఫ్రెషర్స్‌కు ఉపాధి
→ ఉద్యోగ వలసల రేటు 14 శాతంగా నమోదైంది.
మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. బీఎస్‌ఈలో ఇన్ఫోసిస్ షేరు 0.5% లాభంతో రూ. 1,420 వద్ద ముగిసింది.
కొనుగోళ్ల బాటలో...
మిస్సింగ్ లింక్: ఆ్రస్టేలియన్ సైబర్ సెక్యూరిటీ సంస్థ మిస్సింగ్ లింక్‌ను తాజాగా ఇన్ఫోసిస్ సొంతం చేసుకోనుంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ సింగపూర్ పీటీఈ ద్వారా తప్పనిసరి ఒప్పందం కుదుర్చుకుంది. నగదు రూపేణా 9.8 కోట్ల ఆ్రస్టేలియన్ డాలర్లు (సుమారు రూ. 532 కోట్లు) చెల్లించనుంది.
ఎంఆర్‌ఈ: సొంత అనుబంధ సంస్థ ఇన్ఫోసిస్ నోవా హోల్డింగ్స్ ఎల్‌ఎల్‌సీ ద్వారా టెక్నాలజీ, బిజినెస్ కన్సల్టింగ్ సంస్థ ఎంఆర్‌ఈ కన్సల్టింగ్(టెక్సాస్)ను కొనుగోలు చేయనుంది.
పూర్తి నగదు రూపేణా కుదుర్చుకున్న డీల్‌లో భాగంగా 3.6 కోట్ల డాలర్లు(రూ. 307 కోట్లు) వెచ్చించనుంది.
మిత్సుబిషీ హెవీ: ఇన్ఫోసిస్ జేవీ సంస్థ హైపస్‌లో మిత్సుబిషీ హెవీ ఇండస్ట్రీస్ 2 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకు 15 కోట్ల జపనీస్ యెన్‌లు(రూ.9 కోట్లు) ఇన్వెస్ట్ చేయనుంది.
పటిష్ట ఫలితాలు సాధించాం
మార్కెట్‌కు అనుగుణంగా, క్లయింట్ కేంద్రంగా ప్రత్యేక దృష్టిపెట్టడం ద్వారా నిలకడైన సంస్థను నిర్మించాం. ఆదాయం, నిర్వహణ మార్జిన్లు, చరిత్రాత్మక స్థాయిలో ఫ్రీ క్యాష్ సాధనరీత్యా పటిష్ట ఫలితాలు సాధించాం. క్లౌడ్, డిజిటల్, ఏఐలో లోతైన నైపుణ్యం, వ్యయ నియంత్రణ, ఆటోమేషన్.. క్లయింట్ల అవసరాలలో కంపెనీకి పటిష్ట స్థానాన్ని కల్పిస్తున్నాయి.
– సలీల్ పరేఖ్, సీఈవో, ఎండీ, ఇన్ఫోసిస్