
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జనవరి 2025లో రికార్డు స్థాయిలో 16.99 బిలియన్(1,699 కోట్లు)లకు చేరుకున్నాయి. వీటి మొత్తం విలువ రూ.23.48 లక్షల కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా జరిగే మొత్తం రిటైల్ చెల్లింపుల్లో యూపీఐ ద్వారా జరిగే లావాదేవీలే 80 శాతానికిపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 641 బ్యాంకులు, 80 యూపీఐ యాప్‌లు ఈ వ్యవస్థలో భాగస్వామ్యం అయ్యాయి.
లావాదేవీలు పెరగడానికి కారణాలు
నగదు రహిత ఆర్థిక వ్యవస్థ, డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ కోసం భారత ప్రభుత్వం యూపీఐను అందుబాటులోకి తీసుకొచ్చింది. సాంకేతికతలో నిరంతర మెరుగుదల, యూపీఐను వివిధ ప్లాట్‌ఫామ్‌లతో అనుసంధానించడం వినియోగదారుల లావాదేవీలకు భద్రత కల్పించడంతో దీని వాడకం పెరుగుతోంది. తక్షణ చెల్లింపు సౌలభ్యం, యూపీఐ ఆధారిత యాప్‌లు విస్తృతంగా అందుబాటులో ఉండడంతో ఇటు వినియోగదారులు, అటు వ్యాపారులు దీన్ని అవకాశంగా మలుచుకున్నారు.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
యూపీఐ లావాదేవీలు పెరగడం భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావాన్ని చూపుతోంది. ఇది అంతరాయం లేని ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసింది. నగదుపై ఆధారపడటాన్ని తగ్గించింది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతను ప్రోత్సహించింది. అదనంగా డిజిటల్ చెల్లింపుల వినియోగం ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధీకరణకు దోహదం చేసింది. ఇది ఆర్థిక కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి, వాటిని నియంత్రించేందుకు మెరుగైన సాధనంగా ఉంది.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ అపార్ట్‌మెంట్ అద్దె ఎంతంటే..?
భవిష్యత్తు అవకాశాలు
యూపీఐ అభివృద్ధి చెందుతున్నందున దాని భవిష్యత్తు అవకాశాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. దీని పరిధిని విస్తరించడానికి బ్లాక్ చెయిన్, కృత్రిమ మేధ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలతో అనుసంధానించడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. ప్రభుత్వం, ఆర్థిక సంస్థలు, టెక్నాలజీ ప్రొవైడర్ల నిరంతర మద్దతుతో భారత డిజిటల్ చెల్లింపు వ్యవస్థకు యూపీఐ దన్నుగా నిలుస్తోంది.