
మెట్రో నగరాల్లో మిశ్రమ వినియోగ భవనాలు
ఆయా నిర్మాణాల్లో రిటైల్ స్పేస్‌కు డిమాండ్
2025 క్యూ1లో దేశంలో 24 లక్షల చ.అ. లావాదేవీలు
అత్యధికంగా హైదరాబాద్‌లోనే 34 శాతం లీజులు
గ్రేటర్‌లో 8 లక్షల చ.అ. రిటైల్ స్థల లావాదేవీలు
మన తర్వాతే ముంబై, ఎన్‌సీఆర్ నగరాలు
కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ అధ్యయనం వెల్లడి
సాక్షి, సిటీబ్యూరో: మెట్రో నగరాలలో సంప్రదాయ షాపింగ్ మాల్స్‌కు కాలం చెల్లింది. ఇల్లు, ఆఫీసు, మాల్ అన్నీ ఒకే చోట ఉండే మిశ్రమ వినియోగ భవనాలు ఊపందుకుంటున్నాయి. నగరవాసులు నివాసం ఉండే చోటుకు సమీపంలోనే కార్యాలయం, వారాంతాల్లో కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు షాపింగ్ మాల్ కూడా దగ్గర్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. దీంతో అపార్ట్‌మెంట్లు, ఆఫీసు స్పేస్‌తో పాటు రిటైల్ స్పేస్ అందుబాటులో ఉండే మిశ్రమ భవనాలకు డిమాండ్ పెరిగింది.
ఈ ఏడాది జనవరి - మార్చి (క్యూ1)లో దేశంలోని 8 ప్రధాన నగరాల్లో 24 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీలు జరిగాయని కుష్‌మన్ అండ్ వేక్‌ఫీల్డ్ అధ్యయనం వెల్లడించింది. ఏడాది కాలంలో 55 శాతం వృద్ధి రేటు నమోదైంది. అభివృద్ధి చెందుతున్న ప్రాంతాలలో మాల్స్, రిటైల్ సరఫరా పెరగడమే లావాదేవీల వృద్ధికి ప్రధాన కారణం. ఈ ఏడాది వచ్చే మూడు త్రైమాసికాల్లో కొత్తగా 70 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ మార్కెట్‌లోకి అందుబాటులోకి వస్తుందని అంచనా వేసింది.
అత్యధికంగా గ్రేటర్‌లోనే..
గృహాలు, కార్యాలయాల విభాగంలోనే కాదు రిటైల్ స్పేస్‌లోనూ హైదరాబాద్ దూసుకెళుతోంది. 2025 క్యూ1లో జరిగిన లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం వాటా మన గ్రేటర్‌దే. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో నగరంలో 8 లక్షల రిటైల్ స్థల లావాదేవీలు జరిగాయి. ఏడాది కాలంతో పోలిస్తే ఇది 106 శాతం ఎక్కువ. హైదరాబాద్ తర్వాత అత్యధికం రిటైల్ స్పేస్ లావాదేవీలు ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్ నగరాల్లో జరిగాయి. 2025 క్యూ1లో దేశంలో జరిగిన మొత్తం రిటైల్ స్థల లీజుల్లో ముంబై 24 శాతం, ఢిల్లీ–ఎన్‌సీఆర్ 17 శాతం వాటాలను కలిగి ఉన్నాయి. ఆర్థిక రాజధాని(ముంబై)లో 5.8 లక్షల చ.అ., దేశ రాజధానిలో 4.1 లక్షల చ.అ. లావాదేవీలు జరిగాయి.
హైస్ట్రీట్‌కు డిమాండ్..
గ్రేటర్‌లో హైస్ట్రీట్ ప్రాంతాల్లోని రిటైల్ స్పేస్‌కు డిమాండ్ ఎక్కువగా ఉంది. నగరంలో జరిగిన లీజు లావాదేవీల్లో హైస్ట్రీట్ వాటా 90 శాతంగా ఉంది. కొత్తపేట, నల్లగండ్ల, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అత్యధిక లావాదేవీలు జరిగాయి. ఒక్క జూబ్లీహిల్స్‌లోనే ఏకంగా 24 శాతం లావాదేవీల వాటా కలిగి ఉంది. జూబ్లీహిల్స్‌లో రిటైల్ స్పేస్ అద్దెలు ఏటా 13.6 శాతం పెరుగుతున్నాయి. షాపింగ్ మాల్స్‌లో మాత్రం అద్దెలు స్థిరంగా ఉన్నాయి. గచి్చ»ౌలి, నానక్‌రాంగూడ, టోలిచౌకీ ప్రాంతాలలో కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, రోడ్ల విస్తరణలతో మౌలిక సదుపాయాలు మెరుగయ్యాయి. సూక్ష్మ మార్కెట్లతో కనెక్టివిటీ పెరగడంతో ఆయా ప్రాంతాలలో రిటైల్ స్టోర్లు, స్థలాలకు ఆదరణ పెరిగింది.
దేశీయ బ్రాండ్లదే హవా..
ఫ్యాషన్, వెల్‌నెస్, ఫుడ్ అండ్ బేవరేజెస్ విభాగాలు ఎక్కువగా రిటైల్ స్పేస్‌ను లీజుకు తీసుకుంటున్నాయి. లీజు లావాదేవీల్లో దేశీయ బ్రాండ్ల వాటా ఏకంగా 98 శాతంగా ఉంది. ఫ్యాషన్ విభాగం 27 శాతం, వెల్‌నెస్ 19 శాతం, ఫుడ్ అండ్ బేవరేజెస్ 16 శాతం లీజు వాటాలను కలిగి ఉన్నాయి.