
ముంబై: సవరించిన సేఫ్ డిపాజిట్ లాకర్ల ఒప్పందాలను కస్టమర్లతో బ్యాంక్‌లు కుదుర్చుకోవాల్సి ఉండగా, ఇందుకు ఈ ఏడాది చివరి వరకు గడువును ఆర్‌బీఐ పొడిగించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా లాకర్ల ఒప్పందాల్లో మార్పులు చేసి, వాటిపై కస్టమర్ల సమ్మతి తీసుకోవాలంటూ 2021 ఆగస్ట్‌లోనే ఆర్‌బీఐ అన్ని బ్యాంక్‌లను కోరింది. ‘‘పెద్ద సంఖ్యలో కస్టమర్లు నవీకరించిన లాకర్ ఒప్పందాలపై సంతకాలు చేయాల్సి ఉన్నట్టు మా దృష్టికి వచ్చింది.
గడువులోపు (2023 జనవరి 1 నాటికి) లాకర్ ఒప్పందాలను తిరిగి కుదుర్చుకోవాలంటూ కస్టమర్లకు చాలా వరకు బ్యాంక్‌లు తెలియజేయలేదు. కనుక 2023 ఏప్రిల్ 30 నాటికి లాకర్ ఒప్పందాలను తిరిగి కుదుర్చుకోవాల్సిన విషయాన్ని కస్టమర్లకు బ్యాంక్‌లు విధిగా తెలియజేయాలని కోరాం. జూన్ 30 నాటికి కనీసం 50%, సెప్టెంబర్ 30 నాటికి కనీసం 75% కస్టమర్లతో ఒప్పందాలు చేసుకోవాలి. ఒప్పందం కాపీని కస్టమర్‌కు అందించాలి’’ అని తాజా ఆదేశాల్లో ఆర్‌బీఐ పేర్కొంది. జనవరి 1 నాటికి ఒప్పందాలు చేసుకుని లాకర్‌లను స్తంభింపజేస్తే, వాటిని తిరిగి విడుదల చేయాలని ఆదేశించింది.
చదవండి: జొమాటో ‘సీక్రెట్’ బయటపడింది, ఫుడ్ డెలివరీ స్కామ్..ఇలా కూడా చేయొచ్చా!