
ముంబై: రిటైల్ ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో 2022 జనవరి నుంచి విఫలం అవడానికి కారణాలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) నవంబర్ 3వ తేదీన కసరత్తు జరపనుంది. ఇందుకు సంబంధించి ఆర్‌బీఐ యాక్ట్ 45జెఎన్ సెక్షన్ కింద కేంద్రానికి నివేదిక సమర్పించనుంది.
2016లో ఎంపీసీ ఏర్పాటు తర్వాత ఈ తరహా వివరణను కేంద్రానికి ఆర్‌బీఐ సమర్పించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ప్రకారం, ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 6 శాతం లోపు ఉండాలి. అయితే గడచిన మూడు త్రైమాసికాల్లో ఇది ఆ స్థాయి పైనే కొనసాగడం ఆందోళన కలిగిస్తోంది.