
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గడిచిన సెషన్‌తో పోలిస్తే బుధవారం నష్టాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:29 సమయానికి నిఫ్టీ(Nifty) 156 పాయింట్లు తగ్గి 22,381కు చేరింది. సెన్సెక్స్(Sensex) 419 పాయింట్లు నష్టపోయి 73,821 వద్ద ట్రేడవుతోంది. సోమవారం భారీగా పడిన మార్కెట్లకు నిన్నటి ర్యాలీ ఉపశమనం కలిగించినా, ఇది ఒకే రోజుకు పరిమితమయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
అమెరికా డాలర్ ఇండెక్స్(USD Index) 102.45 పాయింట్ల వద్దకు చేరింది. బ్రెంట్ క్రూడ్‌ఆయిల్ బ్యారెల్ ధర 60.55 అమెరికన్ డాలర్ల వద్ద ఉంది. యూఎస్ 10 ఏళ్ల బాండ్ ఈల్డ్‌లు 4.45 శాతానికి చేరాయి. అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో నష్టాలతో ముగిశాయి. ఎస్ అండ్ పీ గత సెషన్‌తో పోలిస్తే 1.57 శాతం నష్టపోయింది. నాస్‌డాక్ 2.15 శాతం దిగజారింది.
ప్రతీకార సుంకాల విధింపు విషయంలో ప్రపంచ దేశాలతో అమెరికా చర్చలకు సిద్ధంగా ఉందంటూ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. డాలర్ బలహీనత, అమెరికా బాండ్లపై రాబడులు దిగివచ్చాయి. ఇతర దేశాలతో పోల్చితే ప్రతీకార సుంకాల వల్ల భారత్ పై పడే ప్రభావం తక్కువేనని అంచనాలూ ఇన్వెస్టర్లకు ఊరటనిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఆర్‌బీఐ ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి.
అప్రమత్తత అవసరం
తీవ్ర అనిశ్చితులతో ప్రస్తుతం ఈక్విటీ మార్కెట్లో భయాందోళనలు భారీగా పెరిగాయి. ట్రంప్ సుంకాల విధింపుతో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితులు ఎప్పుడు సద్దుమణుగుతాయో ఎవరికి సరైన స్పష్టత లేదు. అయినప్పటికీ ప్రపంచ మార్కెట్లతో పోలిస్తే మన మార్కెట్లపై ప్రభావం తక్కువగానే ఉంది. క్షీణత వేళ అప్రమత్తతతో వ్యవహరిస్తూ మంచి షేరు విలువ ఆకర్షణీయంగా కనిపిస్తే కొనుగోలు చేయొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇన్వెస్ట్ చేసేముందు ఆర్థిక నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతున్నారు.
గురువారం(10న) శ్రీ మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్లు పనిచేయవు.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)