
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితులు, ట్రంప్ టారిఫ్‌లతో తలెత్తిన వాణిజ్య భయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)లో దేశీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమపై ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనికితోడు యూరోపియన్ దేశాలపైనా టారిఫ్‌ల అంశం ప్రతికూల ప్రభావాన్ని చూపనున్నట్లు వివరించారు. వెరసి ఐటీ పరిశ్రమకు అతిపెద్ద మార్కెట్లుగా నిలుస్తున్న యూఎస్, యూరప్‌లలో ప్రతీకార టారిఫ్‌లు మందగమనం లేదా ఆర్థిక మాంద్యానికి దారి చూపనున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఇది ప్రపంచవ్యాప్త ఆందోళనలకు కారణమవుతున్నట్లు ఐటీ నిపుణులు విశ్లేషించారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ముగిసిన గత ఆర్థిక సంవత్సరం(2024–25) చివరి త్రైమాసిక(జనవరి–మార్చి) ఫలితాలు నిరాశపరచవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుత ఏడాది(2025–26) ఆదాయ అంచనాలు(గైడెన్స్) నీరసించవచ్చని భావిస్తున్నారు.
ఫలితాలకు రెడీ
ఇకపై సాఫ్ట్‌వేర్ సేవల దేశీ దిగ్గజాలు 2024–25 క్యూ4(జనవరి–మార్చి) ఫలితాల విడుదలకు సిద్ధపడుతున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26)తోపాటు తొలి త్రైమాసిక(ఏప్రిల్–జూన్) ఫలితాలపై అంచనాలు(గైడెన్స్) ప్రకటించనున్నాయి. తొలుత టాటా గ్రూప్ దిగ్గజం టీసీఎస్ 10న ఫలితాలు విడుదల చేయనుంది. ఈ బాటలో విప్రో 15న, ఇన్ఫోసిస్ 17న, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 22న, టెక్ మహీంద్రా 24న పనితీరు వెల్లడించనున్నాయి.
ఇదీ చదవండి: ఎగుమతిదార్లకు బాసటగా కేంద్రం చర్యలు
వ్యయాలు తగ్గవచ్చు
ఐటీ సేవలకు అతిపెద్ద విభాగం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్‌ఎస్‌ఐ)తోపాటు.. కీలకమైన రిటైల్, తయారీ రంగాలలో కంపెనీల వ్యయాలు తగ్గనున్నట్లు భావిస్తున్నారు. విచక్షణాధారిత వ్యయాలపై ప్రతికూల ప్రభావం కనిపించవచ్చని చెబుతున్నారు. దీంతో సమీప భవిష్యత్‌లో రికవరీకి చాన్స్ తక్కువేనని స్పష్టం చేస్తున్నారు. రానున్న రెండు త్రైమాసికాలలో ఐటీ కంపెనీల ఫలితాలు నిరాశరపచడానికితోడు ఆదాయ అంచనాలలో కోతలకు వీలున్నట్లు తెలియజేశారు. ప్రస్తుత టారిఫ్ వార్ కారణంగా రిటైల్, తయారీ రంగాలు డీలా పడవచ్చని అభిప్రాయపడ్డారు. అయితే సర్వైవల్ వ్యయాలు తప్పకపోవచ్చని, జెన్‌ఏఐకు సైతం పెట్టుబడుల కేటాయింపులు పెరగవచ్చని మరికొంతమంది నిపుణులు పేర్కొన్నారు. ఫలితంగా ఈ ఏడాది(2025–26) ద్వితీయార్ధం(అక్టోబర్–మార్చి)లో ఆర్థిక స్థిరత్వం, ఏఐ సేవలకు డిమాండ్ వంటి అంశాలు తిరిగి ఐటీ సేవలకు సానుకూలతను తీసుకువచ్చే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డారు.