
ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి
ఫ ఇన్‌కంట్యాక్స్ అదనపు కమిషనర్ మోహన్‌బాబు
ఫ వేడుకగా నన్నయ వర్సిటీ
ఆవిర్భావ దినోత్సవం
రాజానగరం: ఆదికవి నన్నయ భట్టారకుని పేరిట ఏర్పడిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఖ్యాతిని మరింత ఇనుమడింపజేసే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని ఇన్‌కంట్యాక్స్ అదనపు కమిషనర్ ఎం.మోహన్‌బాబు అన్నారు. వర్సిటీ 19వ ఆవిర్భావ వేడుకలను మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించి, భారతీయ సంస్కృతి, విభిన్న ఆలోచనలను గౌరవిస్తూ విద్యార్థులను ప్రపంచ పౌరులుగా తయారు చేయాలని సూచించారు. విద్యార్థులకు, అధ్యాపకులకు ధరిత్రీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మానవాళి మనుగడకు ప్రకృతి అందిస్తున్న వనరులను కాపాడుకుంటూ పర్యావరణ హితంగా ముందుకు సాగాలని అన్నారు. ఏటా 2.01 బిలియన్ టన్నుల ఘన వ్యర్థాలు ఉత్పత్తి అవుతుంటే, 13 మిలియన్ హెక్టార్లలో అటవీ ప్రాంతం పోతుందని చెప్పారు. మనిషి సృష్టిస్తున్న విధ్వంసంతో ఒక మిలియన్ జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉందన్నారు.
శక్తిమంతమైన విజ్ఞాన కేంద్రంగా..
ఉప కులపతి ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ మాట్లాడుతూ, యూనివర్సిటీని శక్తిమంతమైన, విద్యార్థి – కేంద్రీకృత విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. జాతీయ విద్యా విధానాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం తరగతులు నిర్వహించడంతో పాటు సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు స్వేచ్ఛాయుతంగా జరపాలని సూచించారు. రానున్న కాలంలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ తనిఖీల ద్వారా బోధన పనితీరును నిరంతరం పర్యవేక్షిస్తానని చెప్పారు. మోడల్ మల్టీడిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీగా ఎదగాలనే లక్ష్యంతో ఉన్నామని వీసీ తెలిపారు. వర్సిటీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిబ్బందికి నిర్వహించిన ఆటల పోటీల్లో విజేతలకు బహమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ధరిత్రీ దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీ ఆవరణలో తొలుత మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ కేవీ స్వామి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఆదికవి ఖ్యాతిని ఇనుమడింపజేయాలి