
పీజీఆర్‌ఎస్‌కు 233 అర్జీలు
అమలాపురం రూరల్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమంలో ప్రజలు 233 అర్జీలు సమర్పించారు. వారి నుంచి కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ టి.నిషాంతి, డీఆర్‌ఓ రాజకుమారి, డ్వామా, డీఆర్‌డీఏ పీడీలు, ఎస్.మధుసూదన్, జయచంద్ర గాంధీ, ఎస్‌డీఎస్ కృష్ణమూర్తి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ, అర్జీలను పూర్తి నాణ్యతతో పరిష్కరించాలని ఆదేశించారు. సరైన కారణాలు చూపకుండా ఏ ఒక్క అర్జీనీ పరిష్కరించినట్లు చూపరాదని స్పష్టం చేశారు.
సముద్ర నాచు సాగును ప్రోత్సహించాలి
అమలాపురం రూరల్: జిల్లాలో తీరం వెంబడి చెరువు ఆధారిత సముద్రపు నాచు సాగును ప్రోత్సహించాలని, దీనివలన బహుళ ప్రయోజనాలుంటాయని, సహజ పర్యావరణానికి ఇది లాభదాయకమని కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో సముద్రపు నాచు సాగు విస్తరణ కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనపై ఆయన సమీక్షించారు. ఈ నాచు ఉత్పత్తులు సేంద్రియ ఎరువులుగా, పశుగ్రాసంగా, చేపలకు, కోళ్లకు మేతగా, కాస్మెటిక్స్ తదితర రంగాల్లో ఉపయోగపడతాయని, పర్యావరణ హితమైన ఉత్పత్తులను అందిస్తుందని వివరించారు. గచ్చకాయలపోర, ఎస్.యానాం, రాజోలు సముద్ర తీర ప్రాంతాల్లో అనువైన ప్రదేశాలను ఆర్‌డీఓ కె.మాధవి సమన్వయంతో ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. తొలి దశలో 40 మంది ఔత్సాహిక స్వయం సహాయ సంఘాల మహిళలు, మత్స్యకార సంఘాల ప్రతినిధులతో గ్రూపులు ఏర్పాటు చేయాలన్నారు. వారికి తమిళనాడులోని రామనాథపురం జిల్లా మండపంలో జరుగుతున్న నాచు సాగుపై శిక్షణ ఇప్పించేందుకు విధివిధానాలు మే రెండో తేదీ నాటికి రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో గ్రీన్ క్లైమేట్ ఫండ్ ప్రతినిధి శ్రీహర్ష, జిల్లా మత్స్యశాఖ, అటవీ, కాలుష్య నియంత్రణ మండలి, వ్యవసాయ, ఉద్యాన అధికారులు పీవీ శ్రీనివాసరావు, ఎంవీ ప్రసాదరావు, శంకరరావు, బోసుబాబు, రమణ, ఎల్‌డీఎం కేశవవర్మ, డీఆర్‌డీఏ పీడీ జయచంద్ర పాల్గొన్నారు.
హానికర వ్యర్థాల
ప్రాసెసింగ్ యూనిట్
అమలాపురం రూరల్: అమలాపురం పట్టణంలో పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా గృహ వినియోగ హానికర వ్యర్థాలను శాసీ్త్రయ విధానంలో ప్రాసెస్ చేసి, బూడిదగా మార్చే యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి రోజూ అమలాపురం పట్టణం, చుట్టుపక్కల గ్రామ పంచాయతీల నుంచి వస్తున్న సుమారు 10 టన్నుల వ్యర్థాలను ప్రాసెసింగ్ చేసే యూనిట్‌ను త్వరలో నెలకొల్పనున్నామని వెల్లడించారు. దీనిని సీఎస్‌ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తున్నామన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్, పీకేపీ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ కేవీవీఆర్ రాజు, జిల్లా పంచాయతీ అధికారి శాంతలక్ష్మి పాల్గొన్నారు.