అది మన నిర్లక్ష్యానికి మూల్యమే! | Sakshi Editorial On Odisha Train Accident Reasons | Sakshi
Sakshi News home page

అది మన నిర్లక్ష్యానికి మూల్యమే!

Published Thu, Jul 6 2023 12:15 AM | Last Updated on Thu, Jul 6 2023 12:15 AM

Sakshi Editorial On Odisha Train Accident Reasons

నెల రోజుల క్రితం దిగ్భ్రాంతికి గురిచేసిన ఒరిస్సా ఘోర రైలు ప్రమాద ఘటనకు కారణాలు ఇప్పుడిప్పుడే విచారణలో బయటకొస్తున్నాయి. గడచిన మూడు దశాబ్దాలలో అతి దారుణమైనదిగా నమోదైన ఈ ప్రమాదానికి మానవ తప్పిదం, సిగ్నలింగ్‌ వ్యవస్థలో లోపాలే కారణమని రైల్వే శాఖ దర్యాప్తులో వెల్లడైనట్టు వస్తున్న వార్తలు మన భారతీయ రైల్వేలోని లోపాలకు అద్దం పడుతున్నాయి. అనేక స్థాయుల్లో లోపాల వల్లే 293 మంది ప్రాణాలను బలిగొన్న బాలాసోర్‌ ప్రమాదం జరిగినట్టు రైల్వే భద్రతా కమిషనర్‌ (సీఆర్‌ఎస్‌) ఎ.ఎం. చౌధరి తన దర్యాప్తు నివేదికలో తేల్చినట్టు తాజా సమాచారం.

దాదాపు 1200 మందికి పైగా గాయపడిన ఈ ప్రమాదంపై భద్రతా కమిషనర్‌ దర్యాప్తు ఏం చెబుతుందా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు గత నెల 28న నివేదికను రైల్వే బోర్డుకు సమర్పించారు. మరోపక్క కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) సైతం ఈ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందా అని నేర దర్యాప్తు చేస్తున్నందున ఈ తొలి నివేదికను బయటపెట్టడం లేదు. అయితేనేం, వివిధ మార్గాల్లో బయట కొచ్చిన ఈ నివేదికలోని అంశాలు మిగిలిన దర్యాప్తుకూ, సత్వరం చేపట్టాల్సిన చర్యలకూ స్పష్టమైన సూచికలుగా నిలిచాయి. 

రైల్వే సిబ్బందిని విచారించి, వాఙ్మూలాలను నమోదు చేసుకొని, అలాగే ప్రమాద స్థలం, రైల్వే ఆస్తులకు సంబంధించిన వివిధ కోణాలను పరిశీలించాక సీఆర్‌ఎస్‌ నివేదికను సిద్ధం చేశారు. దాదాపు 40 పేజీల నివేదికలో అవన్నీ పేర్కొన్నారు. ఒరిస్సాలోని బాలాసోర్‌ వద్ద బాహానగా బజార్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో జూన్‌ 2న జరిగిన ఈ రైలు ప్రమాదంలో చెన్నై – కోల్‌కతా ‘కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌’ అప్‌ – లూప్‌ లైనులోకి ప్రవేశించి, అప్పటికే ఆ లైనులో ఉన్న ఓ గూడ్స్‌ రైలును గుద్దుకుంది.

అలా ఆ రెండు రైళ్ళు గుద్దుకోవడంతో బోగీలు పట్టాలు తప్పి, పక్కనే మరో పట్టాలపై వెళుతున్న బెంగుళూరు – హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లోని చివరి కొద్ది బోగీలపై పడడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ (ఎస్‌ అండ్‌ టి) విభాగంలో అనేక స్థాయుల్లో లోపాలతోనే ఇంతటి ప్రమాదానికి కారణమైందన్న నివేదిక సారాంశం అత్యంత కీలకం.

ఈ ఘోర రైలు ప్రమాదానికి ప్రాథమిక కారణమేమిటనే విషయంలో నెలకొన్న గందరగోళాన్ని సీఆర్‌ఎస్‌ నివేదిక పోగొట్టిందనే చెప్పుకోవాలి. ప్రధానంగా మూడు అంశాలను ఈ నివేదిక బయట పెట్టింది. ఒకటి – గతంలో 2018లో ఒకసారి, తాజా ప్రమాద ఘటనకు కొద్ది గంటల ముందు మరో సారి చేసిన మరమ్మతులు అరకొరగా, నిర్లక్ష్యపూరితంగా సాగాయి. ఫలితంగా సిగ్నలింగ్‌ వ్యవస్థ రాజీ పడ్డట్టయింది. రెండు – పదేపదే చేస్తూ వచ్చిన తప్పుల్ని ముందుగా పసిగట్టివుంటే, ఈ ఘోరం జరిగి ఉండేది కాదు. వివరంగా చెప్పాలంటే, 2018లో కేబుల్‌ లోపం తలెత్తింది.

దాన్ని సరిచేసినా, కీలకమైన సర్క్యూట్‌ బోర్డ్‌పై దాన్ని మార్క్‌ చేయలేదు. లోపం సరిచేసేందుకు అప్పట్లో సర్క్యూట్‌ షిఫ్టింగ్‌ పని చేశారు. అందుకు ప్రామాణిక పద్ధతులేమీ పాటించనే లేదు. పైపెచ్చు టెర్మినల్స్‌ మీద అక్షరాలు తప్పుగా పేర్కొన్నారు. అయిదేళ్ళుగా అలక్ష్యం చేసిన ఆ లోపభూయిష్ఠమైన పని ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. మూడు – తప్పుడు వైరింగ్, కేబుల్‌ ఫాల్ట్‌ వల్ల తలెత్తే సమస్యలేమిటో నిరుడు పశ్చిమ బెంగాల్‌లోనే చూశారు. అయినా సరే దిద్దుబాటు చర్యలు చేపట్టలేదు. 

అలాగే బాహానగా బజార్‌ రైల్వేస్టేషన్‌కు సరిపడేలా ముందస్తు ఆమోదంతో సర్క్యూట్‌ డయా గ్రమ్‌ను మార్చి ఉన్నా రాంగ్‌ సిగ్నలింగ్‌ అయ్యేది కాదు. ఈ ఘోరం జరిగేది కాదు. ఎస్‌ అండ్‌ టి విభాగాన్ని వేలెత్తి చూపే ఈ లోపాలే కీలకమైన వేళ ఘోర ప్రమాదానికి కారణమై, అమాయకుల్ని బలిగొన్నాయని నివేదిక చెబుతున్న మాట. ఇక, రైల్వేలలో ఎలక్ట్రానిక్‌ ఇంటర్‌ లాకింగ్‌ సిగ్నలింగ్‌ విధానానికి కీలక కేంద్రస్థానం రిలే రూమ్‌.

రైళ్ళను నియంత్రించే మెకానిజమ్‌లు, అలాగే లెవల్‌ క్రాసింగ్‌లకు సంబంధించిన సిగ్నలింగ్‌ సామగ్రి అయిన ‘రిలే హట్స్‌’ ఈ రిలే రూమ్‌లలోనే ఉంటాయి. అలాంటి రూమ్‌ ఏ స్థాయి వారికి, ఎలా అందుబాటులో ఉండాలనే విషయంలోనూ అనేక లోపాలున్నాయి. సీఆర్‌ఎస్‌ నివేదిక ఈ సంగతీ వెల్లడించింది. నివేదికను సమర్పణకు సరిగ్గా కొద్ది రోజుల ముందే రిలే రూమ్‌కు ఒకటికి రెండు తాళాలు వేయాలని రైల్వే నిర్ణయించడం గమనార్హం.

ఎప్పుడో 2018లో జరిగిన తప్పు ఇప్పుడు ప్రాణాలు బలి తీసుకుందంటే, క్రమం తప్పకుండా చేయాల్సిన చెకింగ్‌లు సవ్యంగా సాగడం లేదనే! రైల్వే స్టేషన్లలో మార్పులు చేసిన సర్క్యూట్లన్నీ సవ్యంగా ఉన్నదీ లేనిదీ పరిశీలించి, పరీక్షించడానికి ఇకపై ప్రత్యేక బృందాన్ని నియోగించాలని సీఆర్‌ఎస్‌ సిఫార్సు చేయడం గమనార్హం. అలాగే, ప్రమాద సందర్భంలో సత్వర స్పందనకు జోనల్‌ రైల్వేలలో ఏర్పాట్లను సమీక్షించాలంది. కళ్ళెదుటే లోపాలు కనిపిస్తున్నాయి గనక ఇకనైనా నిద్ర మేల్కోవాలి.

లోపరహిత వ్యవస్థను సృష్టించాలి. అయితే, అందుకు అవసరమైన ప్రాథమిక వసతుల కల్పన ఎంతో ఖర్చుతో, శ్రమతో కూడింది. దీర్ఘకాలికమైన ఆ పని చేయాలంటే రాజకీయ కృత నిశ్చయం ఉండాలి. రైల్వేలో భారీగా పెట్టుబడి పెట్టాలి. పార్టీల తేడాలు లేకుండా కేంద్రంలో గద్దె మీదున్న ప్రతి ప్రభుత్వంలోనూ అవి కొరవడ్డాయి.

ప్రపంచంలోనే అతి పెద్ద రైల్వే వ్యవస్థల్లో ఒకటైన భారతీయ రైల్వే సవ్యంగా నడవాలంటే బండికి నట్లు, బోల్టులు అన్నీ సక్రమంగా బిగించి ఉండడం అవసరమని ఇకనైనా గ్రహించాలి. ఎడాపెడా వందే భారత్‌ రైళ్ళ కన్నా ప్రస్తుతం ఇదే ఎక్కువ అవ సరం! ఒరిస్సా దుర్ఘటన, దానిపై సీఆర్‌ఎస్‌ నివేదిక ఆ సంగతే గుర్తు చేస్తున్నాయి. గుర్తుపట్టే నాథుడు లేక ఇప్పటికీ బాలాసోర్‌లో పడివున్న 80కి పైగా మృతదేహాలూ మౌనంగా ప్రశ్నిస్తున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement