ఉ‘మైన్‌’ ఫోర్స్‌ | Appointment of women officers in Singareni underground coal mines | Sakshi
Sakshi News home page

ఉ‘మైన్‌’ ఫోర్స్‌

Published Tue, Dec 10 2024 4:30 AM | Last Updated on Tue, Dec 10 2024 1:34 PM

Appointment of women officers in Singareni underground coal mines

‘సిరి వెలుగు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలు నీ తనువుకు సింగారం’... తెలంగాణ రాష్ట్ర గీతంలో సింగరేణి వైభవానికి అద్దం పట్టే అక్షరాలు ఇవి.
ఇప్పుడు ఆ వైభవానికి మహిళా సామర్థ్యం, శక్తి మరింతగా తోడుకానున్నాయి. బీటెక్‌ చదివిన అమ్మాయిలు పెద్ద పట్టణాల్లో సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగం చేయడానికి మాత్రమే ఆసక్తి చూపుతారనేది కేవలం అపోహ మాత్రమే అనేది... సింగరేణిలో తాజాగా ఉద్యోగాలు సాధించిన మహిళల మాటలు వింటే అర్థం అవుతుంది. సింగరేణిలో ఉద్యోగం అంటే ‘కష్టం’ అనే అభిప్రాయం ఉంది, అయితే విజేతలకు మాత్రం అది కష్టమైన కాదు అత్యంత ఇష్టమైన ఉద్యోగం. తమ సంస్కృతి, కుటుంబ బాంధవ్యాలతో ముడిపడిన ఉద్వేగాల ఉద్యోగం. సింగరేణి వాకిట ‘సిరి’ వెన్నెలగా మెరిసే అపూర్వ అవకాశం.

సింగరేణి చరిత్రలో మొట్టమొదటి సారిగా భూగర్భ బొగ్గు గనుల్లో మహిళా అధికారులను నియమిస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఇటీవల సింగరేణి యాజమాన్యం మేనేజ్‌మెంట్‌ ట్రైనీ(మైనింగ్‌) ఎక్స్‌టర్నల్‌ పరీక్ష నిర్వహించింది. ఎంపిక చేసిన 88మందిలో 28మంది మహిళలు ఉన్నారు. ఈ మేరకు శనివారం సింగరేణి యాజమాన్యం నియామక ఉత్తర్వులు విడుదల చేసింది. ఎంపికైన మహిళలను వివిధ ఏరియాల్లోని భూగర్భ గనుల్లో విధులు నిర్వహించేందుకు కేటాయించింది. 

సింగరేణి వ్యాప్తంగా వివిధ ఏరియాలకు మహిళా ఇంజనీర్‌లను కేటాయించి, సోమవారంలోగా వారిని ఆయా ఏరియా జీఎంలకు రిపోర్ట్‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్జీ–1 ఏరియాకు అయిదుగురు, ఆర్జీ–2కు ఆరుగురు, భూపాలపల్లి ఏరియాకు ఆరుగురు, కొత్తగూడెం ఏరియాకు ఆరుగురు, మణుగూరు ఏరియాకు ఇద్దరు, శ్రీరాంపూర్‌ ఏరియాకు ముగ్గురికి పోస్టింగ్‌ ఆర్డర్స్‌ ఇచ్చారు. రిపోర్ట్‌  చేసిన వారందరికీ రెండు వారాల పాటు ఓరియన్ టేషన్  ట్రైనింగ్‌ ఉంటుంది. అందులో మొదటి మూడు రోజులు రక్షణపై ఎంఐటీసీలలో శిక్షణ ఇస్తారు. ఓరియెంటేషన్  ట్రైనింగ్‌ పూర్తయిన తరువాత వారికి కేటాయించిన గనులలో పనిచేయాల్సి ఉంటుంది. సంవత్సరం పాటు ట్రైనీగా పనిచేయాలి. ఆరు నెలలకోసారి రెండుసార్లు పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉత్తీర్ణులైన వారిని కొనసాగించటం జరగుతుందని ఉత్తర్వులో పేర్కొన్నారు. 

అలా మొదలైంది...
బ్రిటిష్‌ కాలంలో, 1952కి ముందు బొగ్గు గనుల్లో మహిళలు, బాలురు పనిచేసేవారు. వీరిని గనుల్లోకి పంపకూడదని గనుల చట్ట సవరణ చేయడం వల్ల 70 ఏళ్లుగా మహిళలు భూగర్భ గనుల్లో పనిచేయడం లేదు. అయితే మహిళా సాధికారతను దృష్టిలో పెట్టుకొని 1952 నాటి గనుల చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 29న గెజిట్‌ను జారీ చేసింది. సింగరేణిలో పురుషులకు మాత్రమే ఉద్యోగాలు పరిమితం చేయడం సరికాదంటూ గతంలో కొందరు హైకోర్టులో కేసు వేశారు. విచారణ అనంతరం మహిళలకు కూడా కార్మికులుగా ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.

 దీంతో వేలాదిమంది ఆడబిడ్డలు వారసత్వం ఆధారంగా సింగరేణిలో ఉద్యోగం సాధించారు. భర్త చనిపోయిన భార్యకు, భర్త వదిలేసి ఒంటరిగా పుట్టింట్లో ఉంటున్న మహిళకు, తండ్రి అనారోగ్యం పాలైతే అతని స్థానంలో కూతురికి ఉపాధి కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి సింగరేణి కార్మిక బలగంలో మహిళల శ్రామిక బలం పెరిగింది. వారిని బదిలీ వర్కర్‌గా తరువాత జనరల్‌ మజ్దూర్‌ హోదాలో జీఎం కార్యాలయాలు, డిపార్ట్‌మెంట్‌లు, ఏరియా ఆసుపత్రులు, వర్క్‌షాపులు, స్టోర్స్‌లలో రిక్రూట్‌ చేశారు. మహిళా కార్మికుల సంఖ్య పెరుగుతుండటంతో భూగర్భ గనుల్లోకి పంపాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది.

యస్‌... మేము
‘రాణి’ంచగలం!
మా నాన్న గారు చిన్నప్పుడే చనిపోయారు. ఇల్లందులో బీటెక్‌ పూర్తి చేశాను. అమ్మ, అన్నయ్యప్రోత్సాహంతోనే  మైనింగ్‌ కోర్సులో జాయిన్  అయ్యా. ఇంట్లో కూర్చొనే పరీక్షకు ప్రిపేర్‌ అయ్యా. తాజాగా వెలువడిన ఫలితాల్లో వీవీటీగా ఎంపికయ్యాను. పురుషులకు దీటుగా మహిళలు రాణించగలరు అని చాటి చెప్పేందుకే ఈ ఉద్యోగం ఎంచుకున్నా.
– షేక్‌ హాసియా బేగం

మూడో తరం  
మా తాత సింగరేణిలో పనిచేసి రిటైర్‌ అయ్యిండు. మా నాన్న ప్రస్తుతం సింగరేణిలో క్లర్క్‌గా పనిచేస్తుండు. వారి స్ఫూర్తితో నేను కూడా సింగరేణిలో చేరాలనుకున్నా. మైనింగ్‌లో బీటెక్‌ చేశాను. తాజాగా సింగరేణి నిర్వహించిన పరీక్షలో ఉద్యోగం సాధించాను. గనిలో పనిచేయటం గురించి ఉత్సాహం తప్ప ఎటువంటి ఆందోళన, భయం లేదు. కష్టపడి పనిచేసే ఆసక్తి ఉంటే ఏ ఉద్యోగమైనా ఒక్కటే.  
– మోగారం బాంధవి

నా కల నెరవేరింది
మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. వ్యవసాయ కుటుంబం. మంథని జేఎన్‌టీయూలో బీటెక్‌ పూర్తి చేశా. మైనింగ్‌ కోర్సు చేయడానికి కారణం మా నాన్న. మహిళలు ఎన్నో రంగాల్లో రాణిస్తున్నారు. అయితే మైనింగ్‌లో మహిళలు తక్కువగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మైనింగ్‌ ఫీల్డ్‌లో ఉద్యోగం చేయడానికి మా నాన్నప్రోత్సహించేవారు. ఆయనప్రోత్సాహంతోనే మైనింగ్‌ కోర్సులో చేరాను. తాజాగా సింగరేణి నిర్వహించిన పరీక్షల్లో ఉద్యోగం సాధించాను. సింగరేణిలో ఉద్యోగం చేయటం నా కల. నా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉంది.
– బైరి అఖిల

– గుడ్ల శ్రీనివాస్, సాక్షి, పెద్దపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement