
వేసవి ముదురుతోంది. తెలంగాణ హైదరాబాద్ నగరంలో సగటు ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. చల్లని నీటిని అందించడానికి ఫ్రిడ్జ్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ, సహజమైన చల్లదనం కోసం నగరవాసులు మళ్లీ మట్టి కుండలనే ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యాన్ని అందించే మట్టి ప్రత్యేకతను గుర్తించినవారు ఇప్పుడు నగరంలోని మార్కెట్లతో పాటు ఆన్‌లైన్ వేదికల నుంచి, ఆర్గానిక్ బజార్ల నుంచి కుండలను కొనుగోలు చేస్తున్నారు. వేసవిలో దాహార్తిని తగ్గించుకోవాలంటే కుండలోని నీటితోనే సాధ్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
బంకమట్టిలోని ఖనిజాలు ఎంజైమాటిక్ కార్యకలాపాలకు మద్దతునిస్తాయి. పోషకాల శోషణను మెరుగుపరుస్తాయి. మట్టిలోని ఖనిజాలు నీటి రుచిని కొద్దిమోతాదులో పెంచుతాయి. తద్వారా అధిక పరిమాణంలో నీరు తాగడానికి దోహదం చేస్తుంది. తద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉండడానికి వీలు కల్పిస్తుంది. ఈ మట్టి నీళ్లలోని ఆల్కలీన్ స్వభావం శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి, రోగనిరోధక వ్యవస్థకు ఊతమిస్తుంది. అలాగే ప్లాస్టిక్ లేదా మెటల్ కంటైనర్లతో పోలిస్తే, మట్టికుండలో నీరు రసాయనాల రహితం. కుండలో నిల్వవున్న నీటికి కాలపరిమితి కూడా ఉండదు. మట్టికుండలు బయోడీగ్రేడబుల్ అంటే పునరి్వనియోగానికి వీలైనవి.
ఫ్రిడ్జ్ వాటర్ తాగడం వల్ల తాత్కాలికంగా దాహం తీరినట్టు అనిపించినా, ఆ తర్వాత శరీరానికి హానినే కలిగిస్తుందని వైద్యులు గత కొంత కాలంగా హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మట్టి కుండలకు డిమాండ్ పెరిగింది. సహజంగానే మట్టికి చల్లబరిచే గుణం ఉంటుంది. మట్టి కుండలు సహజంగా ఆవిరి ద్వారా నీటిని చల్లబరుస్తాయి. వాటిని వేడి వాతావరణానికి అనువైనవిగా తయారు చేస్తాయి.
అలా నీటిని చల్లబరచడం, సహజమైన శీతలీకరణ, మెరుగైన జీవక్రియ, మెరుగైన జీర్ణక్రియతో పాటు రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. వీటితోపాటు మట్టికుండల్లో నీరుటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ఇది పర్యావరణానికీ మేలు చేస్తుంది. అంతేకాదు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలోనూ, వడదెబ్బను నివారించడంలోనూ సహాయపడుతుంది. కడుపులో ఉత్పత్తయ్యే ఆమ్లతను తగ్గించే సామర్థ్యం ఈ నీటికి ఉండటం వల్ల అజీర్ణం, గుండెల్లో మంట వంటి సమస్యలకు నివారణగా పనిచేస్తుంది.
చేతికుండలకు కేరాఫ్ ఆదిలాబాద్..
నగరంలో ఆదిలాబాద్ కుండలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆదిలాబాద్ ప్రాంతం మట్టికళలో ప్రత్యేకత సంతరించుకుంది. అక్కడి మట్టి అత్యంత మెత్తగా, మరిన్ని అధిక ఫిల్టర్ గుణాలు కలిగి ఉంటుందని సమాచారం. అంతేకాక ఆదిలాబాద్ కుండలు మిగతా ప్రాంతాల కుండలకంటే గాఢతతో ఉండి, ఎక్కువ రోజుల పాటు నీటిని చల్లగా ఉంచగలుగుతాయి.
అలాగే వాటిపై ప్రత్యేకమైన చేతి పనితో ఆకర్షణీయమైన డిజైన్లు కూడా జతచేస్తూ అక్కడి కళాకారులు వాటిని సంపూర్ణంగా సంప్రదాయ పద్ధతిలో తయారు చేస్తున్నారు. వేసవిలో టూర్లు ఎక్కువ వెళ్లే వాళ్లు ఉంటారు కాబట్టి వారి కోసం.. బయట ప్రయాణాలకు అనువైన చిన్న పరిమాణంలో క్లే వాటర్ బాటిల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి.
ఆకట్టుకునే వెరైటీలెన్నో..
ప్రస్తుతం మార్కెట్‌లో గడ్డ కుండలు, జైపూర్ కుండలు, పెయింటెడ్ డిజైన్ కుండలు, ఆదిలాబాద్ మట్టి కుండలు వంటి అనేక రకాలు లభిస్తున్నాయి. చిన్న పరిమాణం గల సాధారణ కుండలు నుంచి పెద్ద డిజైనర్ కుండలు వరకూ ఎన్నో రకాలు వినియోగదారులను ఆకట్టుకునేలా కొలువుదీరాయి. చిన్న చిన్నవి రూ.100 నుంచి ధరల్లో ఉంటే మధ్యస్థాయి మోడళ్లు రూ.250–400 మధ్య ఉన్నాయి. ఇంకా పెద్ద డెకరేటివ్ కుండలు రూ.600 నుంచి రూ.1200 వరకూ ధరక్లూ లభిస్తున్నాయి.
ప్రత్యేక హ్యాండీ క్రాఫ్ట్ కుండలు, ప్రత్యేక డిజైన్లతో రూపొందించినవాటి కోసం రూ.1500 ఆపైన కూడా నగరవాసులు వెచి్చస్తున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లోని లామకాన్, సికింద్రాబాద్‌లోని సాక్రడ్ స్పేస్, వంటి చోట్ల నిర్వహించే ఆర్గానిక్ సంతల్లో గచ్చిబౌలిలోని పలు ఆర్గానిక్ బజార్లలో కుండలు ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చాయి. ఈ కుండలు పూర్తి స్థాయిలో హ్యాండ్ మేడ్, రసాయన రహిత మట్టి ఉపయోగించి తయారవుతాయని, అందుకే వీటితో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయని తయారీదారులు చెబుతున్నారు.
ఆన్‌లైన్‌లో.. మట్టి వాసన..
ఏళ్లనాటి మట్టి వాసనకు మళ్లీ మంచి రోజులు వచ్చాయనడానికి నిదర్శనంగా ఆన్‌లైన్‌లో పలు వెబ్‌సైట్లు నిలుస్తున్నాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, కాంప్లాంట్ మార్కెట్లు, సహజశ్రీ, ఆర్గానిక్ ఇండియా వంటి ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా నగరవాసులు మట్టి కుండలు కొనుగోలు చేస్తున్నారు.. ఆర్గానిక్ ఉత్పత్తులను విక్రయించే వెబ్‌సైట్లలో లభించే ప్రత్యేకమైన ‘ఎకో ఫ్రెండ్లీ వాటర్ పాట్స్‘కి మంచి ఆదరణ ఉంది.
ఎర్తెన్ ఫైన్ క్రాఫ్ట్స్ విలేజ్ డెకార్, కావేరీ డెల్టా ప్రాంతం నుంచి హ్యాండీ క్రాఫ్ట్ చేసిన మట్టికుండలు, క్లే కుకింగ్‌వేర్ సైతం అందించే జిష్తా, కుకింగ్ పాన్‌లు, కర్రీ పాన్‌లు, వాటర్ డిస్పెన్సర్లు తదితర మట్టి ఉత్పత్తులు అందించే మడ్ కార్ట్ వంటివి ఆన్‌లైన్ విపణిలో మట్టికి కేరాఫ్‌గా నిలుస్తున్నాయి.
(చదవండి: చిన్నారులకు వచ్చే సాధారణ డెంటల్ సమస్యలకు చెక్‌పెడదాం ఇలా..!)