
పుట్టగొడుగుల్లో ఒక జాతికి చెందిన ‘వైట్ ట్రఫల్’ పుట్టగొడుగుల కోసం ఇటలీలో ఏటా దాదాపు రెండు నెలల పాటు సంబరాలు జరుగుతాయి. ఇటలీలోని అల్బా నగరంలో ఈ సంబరాలు అక్టోబర్ 12న మొదలై, డిసెంబర్ 8 వరకు కొనసాగుతున్నాయి. పుట్టగొడుగుల్లోని అత్యంత ప్రత్యేకమైనవిగా పరిగణించే వైట్ ట్రఫల్ అభిమానులు దేశ విదేశాల నుంచి ఈ వేడుకలకు హాజరవుతారు.
ఈ వేడుకల్లో భాగంగా వైట్ ట్రఫల్ వేలంపాటలు జరుగుతుంటాయి. అల్బా నగరంలో 94 ఏళ్లుగా ‘ఇంటర్నేషనల్ వైట్ ట్రఫల్ ఫెస్టివల్’ పేరిట ఈ సంబరాలు జరుగుతున్నాయి. వేలంపాటల్లో పెద్దసైజులో ఉండే నాణ్యమైన వైట్ ట్రఫల్‌కు కళ్లు చెదిరే ధరలు పలుకుతుంటాయి.
వైట్ ట్రఫల్ సంబరాల్లో భాగంగా వైట్ ట్రఫల్‌తో ప్రత్యేకమైన వంటకాలు తయారు చేయడంలో శిక్షణ శిబిరాలు, వైట్ ట్రఫల్‌ను రుచి చూసి నాణ్యతను ఎంపిక చేసే నైపుణ్యాన్ని పెంపొందించేందుకు టేస్ట్ వర్క్‌షాప్, మ్యూడెట్ ట్రఫల్ మ్యూజియం సందర్శన, ట్రఫల్ వంటకాలతో ప్రతిరోజూ విందులు, ట్రఫల్ వంటకాల తయారీలో షెఫ్‌లకు పోటీలు, అల్బా నగరానికి చేరువలోని రోడీ పట్టణంలో ఉన్న రోడీ కోట సందర్శనతో పాటు ఆ కోటలో ప్రత్యేక విందు వంటి కార్యక్రమాలు జరుగుతాయి.
అల్బాలో వేడుకలు జరిగే చోట ఏర్పాటు చేసే ట్రఫల్ దుకాణాలు జనాలతో కిక్కిరిసి కనిపిస్తాయి. వైట్ ట్రఫల్ కిలో ధర దాదాపుగా 2,300 యూరోల (రూ.2.38 లక్షలు) వరకు ఉంటుంది. అల్బాలో జరిగే ఇంటర్నేషనల్ వైట్ ట్రఫల్ ఫెస్టివల్‌లో పెద్ద పరిమాణంలో ఉండే వైట్ ట్రఫల్‌ను ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటిని వేలం పాటల్లో విక్రయిస్తుంటారు. రెండేళ్ల కిందట జరిగిన వేలంలో 700 గ్రాముల బరువున్న వైట్ ట్రఫల్‌కు ఏకంగా 1.84 లక్షల యూరోల (రూ.16.91 కోట్లు) పలికింది. వేలంలో పాల్గొన్న హాంకాంగ్ సంపన్నుడు ఒకరు దీనిని సొంతం చేసుకున్నారు. వైట్ ట్రఫల్ వేలం పాటల్లో ఇప్పటి వరకు ఇదే రికార్డు.