
పిల్లల కథ
అడవికి దగ్గరగా ఉన్న ఒక గ్రామం నుంచి ఒక గాడిద అడవిలోకి వచ్చింది. బూడిద రంగులో బలిష్ఠంగా ఉన్న గాడిదను చూసిన నక్కకు నోట్లో నీళ్లూరాయి. ఎలాగైనా గాడిద మాంసం తినాలనుకుంది. వెనుక నుంచి నెమ్మదిగా గాడిద దగ్గరికి వెళ్లి దానిపై దాడి చేయబోయింది. కాని, అది గమనించిన గాడిద తన వెనుక కాళ్లు లేపి నక్క దవడ మీద బలంగా ఎగిరి తన్నింది. నక్క కింద పడింది. గాడిద తన గట్టి పళ్లతో నక్క చెవులు కొరికింది. దాంతో నక్క ‘కుయ్యో.. మొర్రో’ అంటూ మృగరాజు దగ్గరికి పరుగు తీసింది. మృగరాజుకు గాడిదపై ఫిర్యాదు చేసింది. ‘ప్రభూ! పక్క గ్రామం నుంచి అడవిలోకి చొరబడిన గాడిద నాపై దాడి చేసింది. ఇప్పుడు మీతో పోరాడి అడవికి రాజు కావాలనుకుంటోంది’ ఆయాసంతో రొప్పుతూ చెప్పింది నక్క.
మృగరాజు అప్పటి వరకు గ్రామాల్లో ఉండే గాడిద గురించి వినటమే గాని, చూడనేలేదు. మృగరాజు వెంటనే తన ఆంతరంగికుడైన ఏనుగును పంపి గాడిదను తన గుహకు తీసుకు రమ్మని చెప్పాడు. ఏనుగు పరుగునవెళ్లి గాడిదను తీసుకువచ్చింది, గాడిద భయం భయంగా గుహ బయట నిలుచుంది.
గుహ లోపల మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతున్న శబ్దం విన్నది గాడిద. మృగరాజు సింహం గుహలోంచి బయటికి వచ్చాడు.గాడిద తన ముందు రెండు కాళ్ళను గాలిలోకి లేపి నమస్కరించింది. ‘ఎవరు నువ్వు!’ ప్రశ్నించాడు మృగరాజు.
‘ప్రభూ! నేను ఈ అడవికి పక్కనే ఉన్న గ్రామంలో ఉంటాను. మా యజమాని నన్ను ఎంతో ప్రేమగా పెంచుకున్నాడు. నేను బరువులు మోస్తూ, అతనికి సహాయం చేసే దాన్ని. పొలంలో మొలిచే కలుపు మొక్కలను తిని పంటను కాపాడేదాన్ని. నా జ్ఞాపకశక్తి, తెలివితేటలకు నా యజమాని పొంగిపోయేవాడు.
అతను ఒక అనాథ. నన్ను తన సొంత బిడ్డలా చూసుకున్నాడు. గత వారం అతను పట్నం వెళ్లి, ప్రమాదవశాత్తూ మరణించాడు. యజమాని మరణించాక నేను గ్రామంలో ఉన్నంతసేపు నాకు నా యజమానే గుర్తుకు వచ్చేవాడు. అందుకే నేను అక్కడ ఉండలేక అడవి బాట పట్టాను!’ చెప్పింది గాడిద. మృగరాజుకు గాడిద మనసు అర్థమైంది. అంతే కాదు శాకాహారి అయిన గాడిద తన ఆత్మరక్షణ కోసమే నక్కను గాయపరచిందని తెలుసుకుంది. నక్క గుణం తెలిసిన మృగరాజు దాన్ని మందలించాడు.
ఇంతలో గుహ నుంచి మృగరాజు చిట్టికూన విపరీతంగా దగ్గుతూ బయటకువచ్చింది.‘మిత్రమా! ఎన్ని పసరు మందులు వాడినా దగ్గు, ఆయాసం, జలుబు గత నెల రోజులుగా నా బిడ్డను వదలటమే లేదు’ విచారంగా అన్నాడు మృగరాజు.
గాడిద చిట్టికూనను పరిశీలనగా చూసి, మృగరాజుతో, ‘ప్రభూ! ఎలాంటి దగ్గు, జలుబు, ఆయాసాన్నయినా పూర్తిగా నయం చేసే ఔషధ గుణం మా పాలలో ఉంది. మా పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
మీరు అనుమతి ఇస్తే నేను మీ బిడ్డకు వైద్యం చేస్తాను’ అంది గాడిద.
మృగరాజు సంతోషంగా అంగీకరించాడు. చిట్టికూనకు గాడిద తన పాలు తాగించింది.పాలు తాగిన చిట్టి కూన నాలుగు రోజుల్లో పూర్తిగా కోలుకుంది. మృగరాజు గాడిదను తనతోనే ఇక్కడే ఉండిపొమ్మన్నాడు. తన యజమాని చూపిన ప్రేమను, గౌరవాన్ని మృగరాజు దగ్గర తిరిగి పొందింది గాడిద. మనం కీడు తలపెట్టినా, మంచివారికి ఎప్పుడూ మంచే జరుగుతుందని తెలుసుకుంది నక్క.