యువ కథ: ముసుగు మనుషులు | yuva katha magazine stories | Sakshi
Sakshi News home page

యువ కథ: ముసుగు మనుషులు

Published Sun, Apr 20 2025 9:33 AM | Last Updated on Sun, Apr 20 2025 9:33 AM

yuva katha magazine stories

మెలకువ వచ్చింది. వెంటనే మళ్ళీ కళ్ళు మూతలు పడ్డాయి. నా చేయి ఫోన్‌ కోసం  వెతకడం మొదలెట్టింది. రాత్రి దిండు కింద పెట్టుకుని పడుకున్నట్టు గుర్తు. నా ప్రతిరోజూ ప్రారంభమయ్యేది, ముగిసేది ఫోన్‌తోనే! వెతుకుతున్న చేతికి ఫోన్‌ తగలగానే, ఏదో స్విచ్‌ వేసినట్టు నా కళ్ళు వెంటనే తెరుచుకున్నాయి.చూస్తే టైమ్‌ ఉదయం తొమ్మిది కావస్తోంది. ఆలస్యం అయిపోయింది. దానికి కారణం రాత్రంతా నిద్రలేదు. ఒకటే కలలు, ఏవేవో ఆలోచనలు. కాని ఒకటి మాత్రం బాగా గుర్తుంది. దేవుడు కనిపించాడు. ‘లోకంలో ఆడా మగ, పేదా ధనిక, కుల మత వర్ణ అసమానతలన్నీ తుడిచేయి దేవుడా. 

సమసమాజాన్ని సృష్టించు భగవాన్‌’ అని నేనడిగితే, ‘తథాస్తు’ అన్నాడు. అంత వరకే గుర్తుంది. అలా ఎందుకు అడిగానో తెలీదు.ఆడవాళ్ళు అవ్వడం వల్ల ఇంట్లో నా భార్య, ఆఫీసులో నా జూనియర్‌ శ్రీలేఖ, డబ్బున్న కుటుంబంలో పుట్టడం వల్ల నా కొలీగ్స్, పెద్ద కులంలో పుట్టడం వల్ల నా స్నేహితుడు రాజు నా కన్నా ఎక్కువ సుఖపడుతున్నారని ఈ మధ్య తెగ ఆలోచిస్తున్నాను. ఈ అసమానతలన్నింటినీ సృష్టించింది ఆ దేవుడేనని, ఆయన మీద కోపాన్ని పెంచుకున్నాను. మనస్సులో అప్పుడప్పుడు దైవ దూషణ కూడా చేశాను. ఈ కల దాని వల్లేనేమో అనిపించింది.

నిద్రమత్తుని అతికష్టం మీద వదిలించుకుని, మంచం దిగి వాష్‌రూమ్‌లోకెళ్ళి, ఫ్రెష్‌ అయ్యి వచ్చే సరికి ముప్పావు గంట పట్టింది. ఎప్పటిలా నేను వాష్‌ రూమ్‌లో ఉండగా నా భార్య ‘లేచావా’ అంటూ తలుపు కొట్టలేదు. వంట గది నుంచి ఎలాంటి కుక్కర్‌ శబ్దాలూ రావట్లేదు. టీవీలో భక్తి స్తోత్రాలు వినిపించట్లేదు. పూజగదిలోనూ కనిపించలేదు తను. అప్పుడే జురాసిక్‌ పార్క్‌లో ఉండే జంతువులన్నీ కడుపులో పరుగెత్తడం మొదలెట్టాయి. వంటగదిలోకెళ్ళాను. ఓ గిన్నెలో పోహా కనిపించింది. నాకు భలే ఇష్టం. తనకు ఇష్టం లేకున్నా, నా కోసం చేసిపెడుతుంది నా భార్య. మొత్తం లాగించేశాక, మళ్ళీ నా భార్య గుర్తొచ్చింది.

‘ఎక్కడికెళ్ళింది అసలు’ అనుకుంటూనే, తన ఫోన్‌కి డయల్‌ చేశాను. రింగ్‌ అయ్యింది కాని, లిఫ్ట్‌ చేయలేదు. ఆ చిరాకుతోనే బైక్‌ తాళాలు తీసుకుని ఆఫీసుకి బయల్దేరాను.‘బ్రేక్‌ఫాస్ట్‌ అయ్యిందా సార్‌’ అన్న గొంతు వినబడింది. బైక్‌ స్టార్ట్‌ చేస్తూనే ‘హా అయింది’ అంటూ ముభావంగానే తలెత్తాను. ఎదురుగా ఓ వ్యక్తి. అతని కళ్ళు, నోరు, చేతులు, కాళ్లు తప్ప ఏమీ కనిపించట్లేదు. షాక్‌ కొట్టినట్టయింది. కాని ఎలాంటి భయమూ కలగలేదు. నాకే ఆశ్చర్యమేసింది.తేరుకున్న నేను, రెండు విషయాల ద్వారా నేను చూస్తున్నది మా ఇంటి ఓనర్‌ని అని గుర్తుపట్టగలిగాను. మొదటిది ఆయన గొంతు. రెండవది తను చూపే మర్యాద. నేను చూíసీ చూడనట్టు ఉన్నా, దగ్గరకొచ్చి మరీ పలకరిస్తాడు. నా ఆశ్చర్యాన్ని పసిగట్టిన అతను ‘అరే! మీరూ నాలాగే అయిపోయారు’ అన్నాడు.

‘మీలాగా’ అంటూ నా మొహాన్ని, చేతులనూ తడుముకున్నాను. ఏమీ ఉన్నట్టు అనిపించలేదు.బైక్‌ మిర్రర్‌లో చూసుకున్నాను. ఏదో చీకటి  ఒళ్ళంతా కప్పేసినట్టు నా కళ్లు, నోరు, చేతులు, కాళ్లుతప్ప ఏమీ కనిపించట్లేదు. భయమేసింది. ఏం జరుగుతోందో అర్థం కాలేదు.నా ఆలోచనలకు సమాధానంగా, మళ్ళీ తనే ‘ఈ రోజు ఉదయం నుంచి అందరి కళ్లు, నోరు, చేతులు, కాళ్లు తప్ప మిగతావేవీ కనిపించట్లేదు. మనం ఇంట్లో, హాస్పిటల్లో ఉంటే మాత్రమే ఇంతకు ముందులా ఒకరికొకరం కనిపిస్తున్నాం. బయటకొచ్చామా, అంతే సంగతులు! ముసుగు మనుషుల్లా అయిపోయాం అందరం. అందరూ దేవుడు ఏదో శపించాడని అనుకుంటున్నారు’ అంటూ పిచ్చివాడిలా తనలో తానే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు.

ఎక్కువ ఆలోచించే టైం లేకపోయింది. బైక్‌ తీసి వెంటనే ఆఫీసుకి బయల్దేరాను. మధ్యలో  బైక్‌ మీద వస్తున్న ఓ మనిషి ఎదురయ్యాడు. బైక్‌కి వేలాడుతున్న పాల డబ్బాలను చూస్తే పక్కింట్లో పాలు పోసేవాడని అర్థమైంది. పక్కింటి నుంచి ఓ నల్లని శరీరం బయటకొచ్చింది. తను పక్కింటి గీత ఆంటీ అని కళ్ళను బట్టి గుర్తుపట్టగలిగాను. పట్టుకుంటే వదలదు. అందుకే తను నన్ను గుర్తుపట్టి పలకరించేలోపే బైక్‌ని పరుగెత్తించాను.ఎక్కడ చూసినా మనుషుల శరీరాలు కనిపించట్లేదు. అంతా మాయగా అనిపించింది. ఓసారి బైక్‌ ఆపి నన్ను నేను గిల్లుకున్నాను. నొప్పేసింది. అయినా జరుగుతున్నదంతా నమ్మబుద్ధి కాలేదు. నాకున్న ఒకే ఒక్క స్నేహితుడు రాజుకి ఫోన్‌ చేశాను. వాడూ లిఫ్ట్‌ చేయలేదు. ఇక చేసేదేం లేక బైక్‌ని ముందుకు పోనిచ్చాను.

కలెక్టర్‌ చౌరస్తా వచ్చింది. జనాలు ఓ మూలన గుమిగూడి ఉన్నారు. ఏమై ఉంటుందా అని దగ్గరికెళ్ళాను. ఎవరో రక్తపు మడుగులో పడున్నారు. కాళ్ళకు మెట్టెలు కనిపించాయి. ఓ మహిళ అని అర్థమయింది. ఎవరూ సెల్ఫీలు తీసుకోవట్లేదు, వీడియో రికార్డింగు చేయట్లేదు. పాపం అని కొందరు బాధపడుతున్నారు. అంబులెన్స్‌కి ఫోన్‌ చేయండి అని ఇంకొందరు కేకలేస్తున్నారు. మొహాలు కనిపించుంటే మాత్రం జనాలు చనిపోతున్నా పట్టించుకోకుండా, ఒక్కొక్కరు పదులకొద్ది సెల్ఫీలు తీసుకునేవారు. 

అనాథలా రక్తపు మడుగులో పడున్నావిడ వీడియోలు రక రకాల కోణాలలో చిత్రించేవాళ్ళు. అంతేగాని రక్షించే ప్రయత్నం చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఈ హఠాత్‌ మార్పుకు కారణం అర్థంకాలేదు. అక్కడున్న ఒక్కాయన్ని అడిగితే ‘అక్కడ రక్తపు మడుగులో పడున్నది ఇక్కడున్న వాళ్ళలో ఏ ఒక్కరి అక్క, అమ్మ, పెద్దమ్మ, అత్తమ్మ ఎవరైనా అయ్యుండచ్చు. గుర్తుపడదామంటే శరీరం కనిపించట్లేదు. విడిచిపెట్టి పోతే అదో రిస్కు. అందుకే వాళ్ళందరూ తాపత్రయ పడేది’ అన్నాడు.

దేవుడు భలే చేశాడనిపించింది. ఎప్పుడూ ‘మన వాళ్ళు.. నా వాళ్ళు’ అంటూ ఉండే మనుషుల జీవితాల్లోంచి స్వార్థాన్ని తీసేశాడు.
ఇంతకుముందు నేనెవరినైనా అలా చూస్తే, చలించిపోయే వాణ్ణి. ఇప్పుడు ఇంతమంది మానవత్వం చూపిస్తుండడంతో నా అవసరం లేదనిపించి ముందుకు కదిలాను.ఆఫీసుకెళ్ళి కూర్చున్నాను. నన్ను మా బాస్‌ రమ్మంటున్నాడని అటెండర్‌ కబురంపాడు. దాంతో వెళ్ళి ఆయన ముందు కూర్చున్నాను.‘అసలు ఇలా ఎలా అయింది? మనుషుల పాపాలు ఎక్కువైపోయాయి’ అని సొల్లు మొదలెట్టాడు.ఇంతకుముందు పని చెప్పడానికే నన్ను పిలిచేవాడు. మాటలతో టైమ్‌పాస్‌ చేయడానికైతే నా జూనియర్‌ శ్రీలేఖని పిలిచేవాడు. ఈ వయసులో ఏం చేద్దామని తహతహో అర్థంకాదు. ఇప్పుడు ఆమె కోతి మొహం కనిపించట్లేదు. అందుకే నేను గుర్తొచ్చానేమో అనిపించింది.

 సమాజంలో స్త్రీ పురుష భేదాలు కూడా తొలగిపోయాయని అర్థమైంది. దేవుడి మీద ఇంకాస్త గౌరవం పెరిగింది. ఇంతలో నా ఫోన్‌ మోగింది. ఏదో కొత్త నంబరు. లిఫ్ట్‌ చేసి మాట్లాడగానే, అవతలివైపు వ్యక్తి చెప్పిన వార్త విని, అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు నిండాయి, కాళ్ళు వణకడం మొదలెట్టాయి. ఒక్క క్షణం ప్రపంచం ఆగిపోయినట్టనిపించింది.హాస్పిటల్‌ బెడ్‌ మీద నా భార్య. ఒళ్ళంతా కట్లు కట్టినట్టున్నారు. ఆమె మొహం తప్ప మరేమీ కనిపించట్లేదు. తనలో కదలిక లేదు. కళ్ళు మూసే ఉన్నాయి. పక్కకు చూశాను. మా అత్తా అమ్మా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు. నేనూ ఏడవాలా? తెలీలేదు. నా బుర్ర పనిచేయట్లేదు. ‘ఏడిస్తే తను తిరిగొస్తుందా?’ అన్న ప్రశ్న అడుగుతోంది నా బుర్ర. ఆ ప్రశ్న కరక్టే కదా!ఏమో ఏం తెలియట్లేదు. సోఫాలో కూలబడిపోయాను. తెలీకుండానే కళ్ళు మూతలుపడ్డాయి.

ఏదో శరీరం నన్ను తాకుతున్నట్టు అనిపించింది. ‘ఊ..ఊ’ అన్న గొంతు వినబడడం మొదలెట్టింది.బరువుగా కళ్ళు తెరిచాను. ఎదురుగా నా సంవత్సరం వయసున్న కొడుకు. నా చెల్లి చేతుల్లోంచి బయటకు రావడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాడు. వాణ్ణి చేతిలోకి తీసుకుని కౌగిలించుకున్నాను. ధైర్యంగా అనిపించింది. నాకంటూ మిగిలింది వాడొక్కడే ఇప్పుడు. నా కౌగిలిని విడిపించుకుని, వాడి అమ్మ వైపు ఒక్క వేలితో చూపిస్తూ ‘ఊ ..ఊ’ అంటున్నాడు. ఎంత ప్రయత్నించినా ఈసారి నా కళ్ళలో నీళ్ళు ఆగలేదు. ధారలుగా నా చెంపలను తడిపేశాయి. అది చూసి వాడు నా కన్నీటికి ఒక వేలిని తాకించి, తడి తాకగానే,  ‘ఊయ్‌’ అన్నాడు, ‘ఏమైంది నాన్నా’ అన్నట్టు. వాడికేం చెప్పాలి? చెప్పినా ఏం అర్థమవుతుంది?.

అప్పుడే వచ్చిన నా స్నేహితుడు రాజు, పక్కన కూర్చొని, ‘మనుషులు మారలేదురా. మారరు కూడా. రోడ్డు మీద శరీరం కనిపించక పోయేసరికి, వాళ్ళ వాళ్ళయ్యుంటారేమో అని హాస్పిటల్‌కి జాగ్రత్తగా తీసుకొచ్చారు.హాస్పిటల్‌ లోనికి రాగానే  శరీరం మొత్తం కనిపించింది. దాంతో వాళ్ళ కులం కాదని ఒకడు, మతం కాదని ఒకడు, ఆడ అని ఇంకొకడు, నా వాళ్ళు కాదని మిగతా వాళ్ళు వదిలేసిపోయారు. డాక్టరు కూడా తెలిసిన వాళ్ళు కాదని, ప్రాణం పోతుందని తెలిసినా, డబ్బు కడితేనే ట్రీట్‌మెంట్‌ అన్నాడట! చివరికి అందరూ ఉన్నా మన దీపూ అనాథలా ప్రాణాలు విడిచింది. లేదు సమాజం చంపేసింది’ ఆవేశంగా మాట్లాడుతున్నాడు రాజు. ఇంతకు ముందు ఎప్పుడూ వాణ్ణి అలా చూడలేదు.

మళ్ళీ వాడే ‘ఇంతకూ ప్రమాదం జరిగింది ఎక్కడో తెలుసా? కలెక్టర్‌ చౌరస్తా దగ్గర. నువ్వు అటు నుంచే పోయుంటావు. నువ్వు చూసుంటే, నువ్వే తీసుకొచ్చేవాడివి. దురదృష్టం. ఇంతకీ తను ఎక్కడికెళ్తుందో తెలుసా? ఉద్యోగానికి. కుటుంబ భారమంతా నువ్వొక్కడివే మోస్తూ బాధపడుతున్నావని, తను నీకు చెప్పకుండా ఏదో ఇంటర్వ్యూకి బయల్దేరింది. ఇంతలోనే ఇదంతా అయింది’ అన్నాడు.నా ఆలోచనలు ఆగిపోయాయి. చావు బ్రతుకుల్లో ఉన్న నా భార్యను నేనే వదిలేశానా అన్న బాధ నా గుండెను కకావికలం చేసింది. కళ్ళు మూతలు పడ్డాయి. ఎదురుగా ఓ వెలుగు కనిపించింది. ‘మానవా!’ అంది ఆ వెలుగు. నేను స్వర్గంలో ఉన్నానో, నరకంలో ఉన్నానో అర్థం కాలేదు.

అప్రయత్నంగా చేతులెత్తి, ‘స్వామీ’ అన్నాను.‘చూశావుగా! నీ కోరిక ప్రకారం అన్ని వివక్షలూ పోగొట్టడానికి నా వంతు ప్రయత్నం చేశాను. కాని, ఫలితం లేదు. మీలాగే పశు పక్ష్యాదులను కూడా పుట్టిస్తున్నాను. వాటిలో ఈ వివక్షలు లేవే! కేవలం మీలో మాత్రమే ఇవి ఉన్నాయి. అందుకే మారాల్సింది మీరూ మీ ఆలోచనలూ. నేనెన్ని చేసినా ఫలితం ఉండదు. ఇకనైనా దైవదూషణ మానేయి నాయనా! కులం, మతం, పేద, ధనిక, ఆడ, మగలాంటి అడ్డుగోడలు మీరు నిర్మించుకున్నవే! వాటికి దేవుడ్ని నిందించడమేల?’ అంటూ ఆ వెలుగు మాయమైపోయింది.ఉలిక్కి పడి కళ్ళు తెరిచాను. ఎదురుగా నా కొడుకుని ఎత్తుకుని నిలుచుంది నా భార్య.నా కొడుకు ‘ఉయ్‌’ అన్నాడు. ‘నాన్న అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు’ అన్నట్టు. 

‘మళ్ళీ పీడకలా?’ అంది నా భార్య.అవునన్నట్టు తలదించుకున్నాన్నేను.‘చూడు విజయ్‌! నేనేమీ సుఖ పడట్లేదు. నీకు ఆఫీసు పని ఎలాగో, నాకు ఇంటి పని అలాగ. చెప్పాలంటే నీకన్నా ఎక్కువే కష్టపడుతున్నాను. ఇక సమాజంలో ఉన్న వివక్షల గురించి అంటావా? మనుషులందరూ రకరకాల ముసుగులేసుకుని బతుకుతున్నారు. అవి పోయే దాకా ఈ వివక్షలు ఇలానే ఉంటాయి. అది మన చేతుల్లో లేదు. మనం మంచి పాటిస్తే అదే మిగతా వారికి ఆదర్శప్రాయం అవ్వచ్చు. అలా కొందరైనా మనల్ని చూసి మారొచ్చు. అది మాత్రమే మనం చేయగలిగింది. ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇంత సెన్సిటివ్‌ అయితే ఎలా? పిల్లాడిలా ప్రవరిస్తున్నావ్‌’ అంది నా భార్య. నా చేతిని తన చేతిలోకి తీసుకుంటూ.ఆ క్షణంలో నా భార్య, నాకు జ్ఞానోదయం కలిగించడానికి ప్రత్యక్షమైన దేవతలా కనిపించింది.   

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement