
‘వయసు పరిమితులు’ అంటుంటాం. అయితే క్రమశిక్షణ, సంకల్పబలం ఆ పరిమితులను తొలగించి గెలుపుదారిని చూపుతాయి. అందుకు తాజా ఉదాహరణ విద్యాసింగ్.
72 ఏళ్ల వయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఓల్డెస్ట్ ఇండియన్ ఉమన్‌గా చరిత్ర సృష్టించింది...విద్యాసింగ్ పారిశ్రామికవేత్త, దాత, అథ్లెట్‌గా ప్రసిద్ధురాలు. 2013 నుంచి ట్రెక్కింగ్‌పై ఆసక్తి పెంచుకుంది. భారతదేశం, భూటాన్, దక్షిణ అమెరికా... 19 ట్రెక్కింగ్‌లను పూర్తి చేసింది.
విజయనగరం రాజకుటుంబానికి చెందిన విద్యాసింగ్ మద్రాస్‌లో పెరిగింది. చర్చ్ పార్క్, స్టెల్లా మేరీస్ కాలేజి వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో చదువుకుంది. ఆమె తండ్రి గోల్ఫ్, టెన్నిస్ క్రీడాకారుడు. గుర్రపు స్వారీ చేసేవాడు. తల్లి అద్భుతమైన టెన్నిస్ క్రీడాకారిణి.
పదమూడు సంవత్సరాల వయసు నుంచే తల్లితో కలిసి టెన్నిస్ టోర్నమెంట్‌లలో పాల్గొనేది విద్యాసింగ్. ‘టోర్నమెంట్ గెలిచిన తల్లీకూతుళ్ల జట్టు’ అని పత్రికల పతాక శీర్షికలలో వచ్చేది. మద్రాస్ యూనివర్శిటీ మహిళల టెన్నిస్ జట్టుకు విద్యాసింగ్ కెప్టెన్‌గా వ్యవహరించింది. మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో పతకాలు గెలుచుకుంది.
ప్రతి వారాంతంలో తన బృందంతో కలిసి 50–60 కిలోమీటర్‌లు సైక్లింగ్ చేస్తుంది. మారథాన్‌లలో పాల్గొనడం, గుర్రపు స్వారీ చేయడం ఆమెకు ఇష్టం. కిలిమంజారో ‘ట్రెక్కింగ్ శిఖరం’ అయినప్పటికీ తీవ్రమైన పరిస్థితులు, తీవ్రమైన ప్రమాదాలు పొంచి ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని చెన్నైకి చెందిన ‘గెట్ అప్ అండ్ గో’ అనే ట్రెక్కింగ్ కంపెనీతో కలిసి ట్రెక్కింగ్ చేసింది. ఈ బృందంలో 10 మంది ట్రెక్కర్లు ఉన్నారు.
ఆరో రోజు రాత్రి 10.30 గంటలకు పర్వతారోహణ ప్రారంభమైంది. గంటల తరబడి కఠినమైన పర్వతారోహణ తరువాత తెల్లావారేసరికి ఈ బృందం స్టెల్లా పాయింట్‌కు చేరుకుంది. ఆపై మరో 45 నిమిషాలు ట్రెక్కింగ్ చేసి కిలిమంజారో ఉహురు శిఖరానికి చేరుకున్నారు. ‘రోజంతా ఆకాశంలో గడపడం అద్భుతంగా అనిపించింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి’ అని ఆరోజును గుర్తు చేసుకుంది విద్యాసింగ్. వయసు పరిమితిని అధిగమించి విద్యాసింగ్ అపూర్వ విజయాన్ని సాధించడానికి కారణం ఏమిటి? ఆమె మాటల్లో చెప్పాలంటే... ‘గుడ్ జీన్స్’ ఇంకా చెప్పాలంటే క్రమశిక్షణతో కూడిన జీవనవిధానం, క్రమం తప్పని వ్యాయామాలు.