Visakhapatnam: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు! | Visakhapatnam: Kaamya Karthikeyan Conquering Peaks In 5 Continents Sahas | Sakshi
Sakshi News home page

Kaamya Karthikeyan: ఐదు ఖండాలను చుట్టేసిన కామ్య.. ఎన్నెన్నో అవార్డులు!

Published Wed, May 18 2022 1:55 PM | Last Updated on Wed, May 18 2022 2:13 PM

Visakhapatnam: Kaamya Karthikeyan Conquering Peaks In 5 Continents Sahas - Sakshi

‘మహిళలు, ఆడపిల్లలు అవరోధాల్ని అధిగమించి.. ఖండాతరాల్లో ఖ్యాతిని ఇనుమడింపజేయాలి. ఇలాంటి వారందరికీ విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్‌ అనే చిన్నారి స్ఫూర్తినిచ్చింది. దక్షిణ అమెరికాలోని అత్యంత ఎత్తయిన అకాన్‌కాగువా పర్వతాన్ని అధిరోహించి భారతీయులందరిలోనూ స్ఫూర్తి నింపింది. ఇది ఎంతో గర్వకారణం. అందుకే ఈ విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను.’ – మన్‌కీబాత్‌లో ప్రధాని మోదీ 

ఈ ఒక్క ప్రశంస చాలు.. ఆమె సాధించిన ఘనత గురించి చెప్పుకోవడానికి.!  బుడి బుడి అడుగులు వేసే వయసులోనే..  కొండలెక్కడం మొదలుపెట్టింది. బొమ్మలతో ఆడుకోవాల్సిన సమయంలో పర్వతారోహణ చేపట్టింది. అలా మొదలైన ప్రయాణం.. రికార్డులు తిరగరాసేంత వరకు చేరింది. మూడేళ్లకే ట్రెక్కింగ్‌.. తొమ్మిదేళ్లకే ఎవరెస్ట్, పదేళ్లకే కిలిమంజారో.. ఇప్పుడు సాహస్‌.. ఇలా ఆ బాలిక సంకల్పబలం ముందు శిఖరం సైతం సాహో అంటోంది.

ఏడు ఖండాల్లోని ఎత్తైన శిఖరాలను అధిరోహించడమే లక్ష్యంగా అడుగులు వేస్తూ.. ఇప్పటికే ఐదు అతి ఎత్తయిన శిఖరాగ్రాల్లో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడించింది. వచ్చే నెలలో ఉత్తర అమెరికాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీని చేరుకునేందుకు సన్నద్ధమవుతోంది. ఆ సాహసి పేరే కామ్య కార్తికేయన్‌.  
– సాక్షి, విశాఖపట్నం


ఐదు ఖండాల్లో త్రివర్ణ రెపరెపలు  
ఒక్కో రికార్డు తన ఖాతాలో వేసుకుంటున్న కామ్య.. 2017 మే 16 నుంచి రోజుకు 9 గంటల పాటు నడుస్తూ 9 రోజుల్లోనే 18 వేల అడుగుల ఎత్తయిన ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌ను పూర్తి చేసి.. ఈ ఘనత సాధించిన అతి చిన్న వయసున్న భారతీయ బాలికగా రికార్డు సొంతం చేసుకుంది. అప్పుడే ‘సాహస్‌’యాత్రకు బీజం పడింది. ఏడు ఖండాల్లోని అతి ఎత్తయి న పర్వతాలను అధిరోహించాలన్న సంకల్పం కామ్యలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

అనుకున్నదే తడవుగా.. ఎవరెస్ట్‌ ఎక్కిన కొద్ది నెలల వ్యవధిలోనే ఆఫ్రికా ఖండంలో 19,340 అడుగులతో అతి ఎత్తయిన పర్వతమైన కిలిమంజారోని అధిరోహించింది. పిన్న వయసులోనే కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన రెండో భారతీయ బాలికగా మరో రికార్డు సాధించింది. పదేళ్ల వయసులో స్టాక్‌ కాంగ్రీ పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేసి మరో రికార్డు సృష్టించింది.

ఆసియా, ఆఫ్రికా తర్వాత ఆస్ట్రేలియా ఖండంలో 7,310 అడుగుల అత్యంత ఎత్తయిన శిఖరం మౌంట్‌ కోసియాజ్కోను 2019లో పూర్తి చేసింది. తల్లి లావణ్యతో కలిసి వెళ్లిన కామ్య.. మైనస్‌ 5 డిగ్రీల ఉష్ణోగ్రత వేధిస్తున్నా.. మౌంట్‌ కోసియాజ్కోను అధిరోహించిన అతి పిన్నవయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. కామ్య పట్టుదలకు ఆస్ట్రేలియన్‌ ఎంబసీ అభినందనలు తెలిపింది.

అనంతరం దక్షిణ అమెరికాలోని 22,837 అడుగుల అత్యంత ఎత్తయిన  అకాన్‌కాగువా పర్వతాన్ని అవలీలగా అధిరోహించేసింది. రష్యాలోని 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రుస్‌ పర్వతాన్ని అధిరోహించి ప్రపంచంలో అతి చిన్న వయస్కురాలిగా రికార్డు పుటల్లో స్థానం సంపాదించింది. 

ఆ అలవాటే.. అవార్డులు తెచ్చిపెడుతోంది!
విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్‌ తండ్రి కార్తికేయన్‌ తూర్పు నౌకాదళంలో కమాండర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కార్తికేయన్‌ స్పోర్ట్స్‌ పర్సన్‌గా నేవీలో ప్రశంసలు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది కామ్య కార్తికేయన్‌. కామ్యకు నడక రాని సమయంలో తండ్రి కార్తికేయన్, తల్లి లావణ్య ఆ చిన్నారిని ఎత్తుకొని ట్రెక్కింగ్‌కు, వాకింగ్‌కు వెళ్లేవారు.

బుడిబుడి అడుగులు వేస్తున్న సమయంలో తల్లిదండ్రులతో పాటు కామ్య కూడా ట్రెక్కింగ్‌ అలవాటు చేసుకుంది. ఆ అలవాటే.. కామ్యకు రికార్డులు తెచ్చిపెడుతున్నాయి. అలా నగరంలోని వివిధ కొండల్లో జరిగే ట్రెక్కింగ్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం ప్రారంభించింది. మూడేళ్ల ప్రాయంలో ముంబయిలోని లొనోవ్‌లా ప్రాంతంలో ట్రెక్కింగ్‌లో తండ్రితో పాటు పాల్గొని అందరినీ అబ్బురపరిచింది. 

తల్లిదండ్రులతో కలిసి సహ్యాద్రి పర్వత శ్రేణులతో పాటు గుల్మర్గా దర్శనీయ స్థలానికీ నడుచుకుంటూ వెళ్లింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడలేదు. మహారాష్ట్రలోని డ్యూక్స్‌ నోస్, రాజ్‌గడ్‌ పర్వతాలను నాలుగేళ్ల వయసులో తల్లిదండ్రులతో పాటు అవలీలగా ఎక్కి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఏడేళ్ల ప్రాయంలో హిమాలయాల ట్రెక్కింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమైంది.

మొదటి ప్రయత్నంలో 2015 మేలో హిమాలయ పర్వత శ్రేణిలో 12 వేల అడుగుల చంద్రశీల, 2016లో 13,500 అడుగుల హర్‌కిదున్, 13,500 అడుగుల ఎత్తయిన కేదార్‌కంఠ, 5,029 మీటర్ల ఎత్తులో ఉన్న రూప్‌కుండ్‌ మంచు పర్వతారోహణ పూర్తి చేసింది. తొమ్మిదేళ్ల వయసులోనే హిమాలయాల్లోని రూప్‌కుండ్‌ మంచు సరస్సును అధిరోహించి.. ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు అర్హత సాధించింది. 

ప్రశంసించిన మోదీ 
మన్‌కీ బాత్‌లో విశాఖ నగరానికి చెందిన కామ్య కార్తికేయన్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు జల్లు కురిపించారు. ఆసియా ఆవల ఉన్న దేశాల్లో 7 వేల మీటర్ల అత్యంత ఎత్తయిన శిఖరంపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేసిన కామ్య ధైర్యం అందరిలోనూ స్ఫూర్తినింపిందంటూ కొనియాడారు. ‘మిషన్‌ సాహస్‌’లో భాగంగా పర్వతారోహణ చేస్తున్న కామ్య వివిధ దేశాల్లో ఉన్న అత్యంత  ఎత్తయిన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా ముందుకెళ్తోందన్నారు.

ఈ మిషన్‌లో కామ్య సఫలీకృతమై. భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. శక్తి సామర్థ్యాల విషయంలో భారతీయ మహిళలందరికీ స్ఫూర్తిగా నిలవాలని పిలుపునిచ్చారు. సాహస యాత్రలకు గుర్తింపుగా ఇటీవలే పీఎం రాష్ట్రీయ బాల పురస్కారాన్ని కూడా కామ్య అందుకుంది. 

ఉత్తర అమెరికా వైపు  అడుగులు.. 
విశాఖ నేవీ స్కూల్‌లో చదువుతున్న కామ్య కార్తికేయన్‌.. ఆరో ఖండంలోనూ  సత్తా చాటేందుకు సన్నద్ధమవుతోంది. సాహస్‌ యాత్రలో ఉత్తర అమెరికాలోని అలస్కాలోని అతి ఎత్తయిన శిఖరం డెనాలీపై భారత కీర్తి పతాకాన్ని ఎగరేయాలని భావిస్తోంది. జూన్‌ 22వ తేదీన ఈ యాత్రను ప్రారంభించేందుకు ముహూర్తంగా నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి సన్నద్ధతతో కామ్య ఉన్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.

డెనాలీ పర్వత శిఖరం 20,310 అడుగుల ఎత్తు ఉంటుంది. దీన్ని అధిరోహించే కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తే.. మిగిలినది అంటార్కిటికాలో అతి ఎత్తయిన శిఖరం మౌంట్‌ విన్సెన్‌ మాసిఫ్‌. ఇది అంటార్కిటికా మంచు పర్వత శ్రేణుల్లో 16,050 అడుగుల ఎత్తులో ఉంది. దీనిని కూడా అధిరోహిస్తే.. కామ్య కార్తికేయన్‌ సాహస్‌ యాత్ర పూర్తవుతుంది. 

ఏడు ఖండాల్లోనూ దేశ కీర్తిని పెంచడమే లక్ష్యం 
తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ప్రతి అడుగు ముందుకేస్తున్నాను. అమ్మ లావణ్య నా వెన్నంటే ఉంటుంది. అందుకే.. అటు చదువులోనూ, ఇటు పర్వతారోహణలోనూ అపజయమే లేకుండా ముందుకెళ్లగలుగుతున్నాను. ఏడు ఖండాల్లో ఉన్న అతి ఎత్తయిన శిఖరాలను అధిరోహించి భారతీయ జెండాను రెపరెపలాడించడమే నా లక్ష్యం. జూన్‌లో ఉత్తర అమెరికా శిఖరాన్ని అధిరోహించిన తర్వాత.. అంటార్కిటికాలోని చివరి పర్వతాన్ని ఎక్కేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటా. కష్టమైనా ప్రతి ఒక్క విజయాన్ని సాధించే తీరుతాను.  
–కామ్య కార్తికేయన్, పర్వతారోహణ చేస్తున్న బాలిక 

 

ఇకపై వేసే ప్రతి అడుగూ ఒక సవాలే.. 
చిన్నతనం నుంచి మాతో పాటు ట్రెక్కింగ్‌కు తీసుకెళ్లే వాళ్లం. ఏ మాత్రం ఇబ్బంది పడేది కాదు. మేము నడవొద్దని చెప్పినా.. వినకుండా మాతో పాటు ఎంత ఎత్తుకైనా నడుచుకుంటూ వచ్చేది. అలా అలవాటు చేసుకున్న కామ్య.. శారీరకంగానూ మానసికంగానూ పర్వతారోహణకు సిద్ధపడుతూ వచ్చింది.

ఇప్పటి వరకూ ఐదు అతి పెద్ద శిఖరాలు అధిరోహించినందుకు గర్వంగా ఉంది. అయితే.. ఇకపై కామ్య వేసే ప్రతి అడుగూ సవాలుతో కూడుకున్నది. అంతే కాదు.. ఎక్కువ ఖరీదైన అంశం కూడా. ఎందుకంటే.. ఈ రెండు శిఖరాలను అధిరోహించాలంటే ఆర్థికంగా ముడిపడిన అంశం. ప్రభుత్వం తోడ్పాటునందించాలని కోరుతున్నాం.  
– లావణ్య కార్తికేయన్, కామ్య తల్లి  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement