న్యూఢిల్లీ : పర్వతారోహణ అనేది ఎంత కష్టమైనదో అందరికి తెలిసిందే. ఈ సాహసం చేసే క్రమంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. ప్రాణాలతో బయట పడతామో లేదో తెలియని పరిస్థితులు ఉంటాయి. అలాంటింది.. పుణేకు చెందిన తొమ్మిదేళ్ల అద్వైత్ ఇవేమీ లెక్క చేయకుండా ముందుకు సాగుతున్నాడు. తాజాగా ఆఫ్రికాలోనే అత్యంత ఎతైన కిలిమంజారో పర్వతాన్ని అద్వైత్ అధిరోహించాడు. ఈ పర్వతం సుమద్ర మట్టానికి 19,341 ఫీట్ల ఎత్తులో ఉన్న సంగతి తెలిసిందే. తన ట్రైనర్ సమీర్ సారథ్యంలో అద్విత్ జూలై 31వ తేదీన ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు.
ఈ సందర్భంగా అద్వైత్ మాట్లాడుతూ.. ‘పర్వతారోహణ అనేది చాలా కష్టమైనది.. కానీ చాలా సరదాగా కూడా ఉంటుంది. ట్రెక్కింగ్ చేసేటప్పడు గొప్ప అనుభూతి కలుగుతుంది. నేను చాలా త్వరగా ట్రెక్కింగ్ పూర్తి చేయాలనుకున్నాను. కానీ పర్వతాల్లో ఉన్న అందాలను చూడటానికి నేను చాలా సార్లు విరామం తీసుకున్నాను. పైకి వెళ్లే కొద్ది ఆక్సిజన్ స్థాయి తగ్గిపోతుంది. అలాగే ఉష్ణోగ్రతలు మైనస్‌లలో ఉంటాయి. అలాగే ఎన్నో సవాళ్లను ఎదుర్కొవాల్సి వస్తుంద’ని తెలిపాడు. అయితే అద్వైత్ తనకు ఆరేళ్లున్నప్పుడే(2016లో) ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించాడు. ఏడు రోజుల్లోనే ఆ ఘనత సాధించాడు. అలాగే వచ్చే ఏడాది యూరప్‌లో ఎత్తైన ఎల్‌బ్రస్ పర్వతాన్ని అధిరోహించేందుకు అద్వైత్ సిద్దమవుతున్నాడు.
అద్వైత్ సాధించిన ఘనతపై అతని తల్లి పాయల్ ఆనందం వ్యక్తం చేశారు. అద్వైత్‌ను చూస్తే గర్వంగా ఉందని అన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడానికి అద్విత్ రెండు నెలల పాటు కఠిన శిక్షణ తీసుకున్నాడు. అద్వైత్ దినచర్య విషయానికి వస్తే.. రోజు గంటపాటు స్విమ్మింగ్ చేస్తాడు. మరో గంట పాటు ఫుట్‌బాల్, క్రికెట్, టెన్నిస్ ఆడతాడు. ఆ తర్వాత గంటపాటు ఆర్మీ జవాన్ల చేసే విన్యాసాలు చేస్తాడు. అద్వైత్‌కు ఉన్న పట్టుదల చూస్తే గర్వంగా ఉంది. పర్వతారోహణ చివరి రోజు అద్విత్ చాలా ఉద్వేగానికి లోనయ్యాడు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపాడ’ని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment