
మంచిమాట
ఎంతోమందికి పేరు ప్రఖ్యాతులు రాకపోవటానికి కారణం ఆయా రంగాలలో నిష్ణాతులైన వారు అప్పుడే వృద్ధిలోకి వస్తున్న వారికి అవకాశం ఇవ్వకుండా అన్నీ తామే చేసి, ఘనతని చాటుకుంటూ ఉండటమే. దీనివల్ల రెండు ప్రమాదాలు జరుగుతాయి. ఒకటి అవతలివారు ఎప్పటికీ ఆ పని చేయలేరు. రెండవది వారికి తనని నిరూపించుకునే అవకాశం లభించక పోవటం. వాళ్ళు సరిగ్గా చేయరు కనుక మేము చేశాం అని సమర్థించుకుంటారు. పోనీ, ఒకసారి సరిగ్గా చేయక పోయినా నేర్చుకుంటారు మరొకసారికి. ఎవరూ మొదటిసారి నిర్దుష్టంగా చేయరు, ఈ మాట అన్నవారితో సహా!
చిన్నప్పుడు తెలుగు వాచకంలో గాడిద, కుక్క కథ చదివిన వారే అందరూ. ఎవరి పని వారే చేయాలి, చేయ నియ్యాలి అన్నది ఆ కథలో ఉన్న నీతి అనుకుంటాం. అంతకు మించి ఉంది. అవతలి వారు చేసే పని తనకు కూడా వచ్చు కదా అని చేసేస్తే వారికి అవకాశం పోయినట్టే కదా!
సాహిత్యసభలో అధ్యక్షస్థానంలో ఉన్నవారు తరువాత మాట్లాడవలసిన ప్రధాన వక్త మాట్లాడవలసిన విషయాలు అన్నీ తాము చెప్పటమే కాదు, వారి సమయం కూడా వీరే మింగేస్తారు. ప్రధానవక్త ఏం చేయాలి? సమయస్ఫూర్తి ఉంటే సరి. లేకపోతే చాలా అయోమయంలో పడిపోవటం గమనించవచ్చు. తెలియక చేసేవారు కొంత మంది అయితే, కావాలని చేసే వారు మరికొంత మంది. పుస్తకానికి ముందు మాట రాయమంటే గ్రంథంలో ఉన్న విషయాన్ని సంగ్రహంగా చెప్పేస్తారు.
అది చదివిన వారికి గ్రంథం చదివే కుతూహలం చప్పబడిపోతుంది. ఉత్కంఠ కలిగించే విధంగా క్లుప్తంగా రాయటం ఎంతమందికి చేతనవును? ముందుమాట గాని, విమర్శ గాని, వ్యాఖ్యానం గాని చదివినా, విన్నా గ్రంథం చదవాలనే కుతూహలం కలగాలి. ఇందులో ఉన్నది ఇంతే కదా! అనే భావన కలుగ కూడదు. దీన్నే అంటారు బంగాళాఖాతం అంత ఉపోద్ఘాతం అని. తనకు ఎంత తెలుసు అన్నది ముఖ్యం కాదు ఎంత ప్రదర్శించాలి అన్నది ప్రధానం. అటువంటి వారిని మఱ్ఱిచెట్లతో పోలుస్తారు.
పోతనామాత్యులవారు శ్రీమద్భాగవతాన్ని అనువాదం చేస్తూ, తనకు కలిగిన భాగ్యం తన శిష్యులకి కూడా కలగాలని వారికి కూడా అవకాశం ఇచ్చాడు. వెలిగందల నారయ, గంగన, ఏల్చూరి సింగన పేర్లు కూడా గ్రంథస్థం చేశాడు. శిష్యుల చేత చేయించి, అది కూడా తన పేరుతో ప్రచురించుకునే ‘బాధ గురువు’ కాదు. ఆ అవకాశం ఇవ్వక పోతే వాళ్ళ పేర్లు ఎవరికి తెలిసేవి కావు.
కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు యుద్ధం చేసి ఉంటే అర్జునుడికి మహావీరుడనే ఖ్యాతి వచ్చేది కాదు. ఆ మాటే కుంతి దేవి అంటుంది. ‘ధర్మరాజుని పట్టాభిషిక్తుణ్ణి చేయటానికి అర్జునుడికి మహావీరుడనే ఖ్యాతి రావటానికి నువ్వు అవతరించావని కొందరు అంటూ ఉంటారు.’’ అంటుంది. నిజమే కదా!
అందరికీ తమని నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. అది ఔదార్యం.
మఱ్ఱిచెట్టు నీడని ఇచ్చి సేద తీరుస్తుంది కాని, దాని నీడలో మరొక మొక్క గాని, కనీసం గడ్డి కూడా పెరగదు. తన విస్తరణ ఎదుగుదల మరి ఎవ్వరికీ అవకాశం లేకుండా చేయటం సమంజసం కాదు. సజ్జనులు అ విధంగా చేయరు. ఈ విషయం నత్కీరుడి కథలో బాగా తెలుస్తుంది. నత్కీరుడు ద్రవిడ దేశంలో పెద్ద పండితకవి. అందరి కవిత్వంలో తప్పులు పడతాడు. శివుడితోనే వాదించి శాపం పొంది, శాప విమోచనం కోసం కుమారస్వామిని సేవించుకోవడానికి రాజ్యం వదలి వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న కవుల ముఖకమలాలు వికసించాయి అంటాడు శ్రీనాథుడు. అతడు ఉన్నంత కాలం ఎవరికి అవకాశం ఇచ్చేవాడు కాదు.
– డా. ఎన్. అనంత లక్ష్మి