
అది ఒక గురుకులం. ఒక శిష్యుడికి శిక్షణ పూర్తయింది. గురువుగారు అతన్ని పిలిచి ‘‘నాయనా! ఇక నీ శిక్షణ పూర్తయింది. నీవిక వెళ్లి, గృహస్థాశ్రమం స్వీకరించి, నీ విద్యలన్నిటినీ లోకకల్యాణానికి ఉపయోగించు.’’ అని చెప్పాడు.. ఆ శిష్యుడు చాలా పేదవాడు. అయినప్పటికీ, గురువుగారికి ఎంతో కొంత దక్షిణ చెల్లించా లనుకుని గురువుగారిని అడిగాడు దక్షిణ ఏమి కావాలని. అతని గురించి తెలిసిన గురువుగారు ‘‘నాకేమీ వద్దు’’ అని చెప్పారు. అయినా సరే, వదలకుండా పదే పదే అడుగుతుండడంతో విసిగిపోయిన గురువు ‘‘నీకు నేను 14 విద్యలను నేర్పాను. ఒక్కో విద్యకూ లక్ష బంగారు నాణాల చొప్పున పద్నాలుగు లక్షల బంగారు నాణాలు చెల్లించు’’ అని చెప్పాడు.
గురుదక్షిణ చెల్లించాలన్న సంకల్పమే తప్ప దానిని ఎలా సమకూర్చుకోవాలో తెలియని ఆ శిష్యుడు కౌత్సుడు. అయితే, రాజు తండ్రి వంటి వాడు కాబట్టి రాజునే అడుగుదామనుకుని నేరుగా రాజు వద్దకు వెళ్లాడు. ఆ రాజు రఘువు. మహాపరాక్రమవంతుడు, ధర్మనిష్టాగరిష్ఠుడు. ఆడిన మాట తప్పనివాడు. కౌత్సుడు ఆయన వద్దకు వెళ్లడానికి ముందురోజే ఆయన విశ్వజీ అనే యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ నియమంగా తనకున్న సర్వస్వాన్నీ దానం చేశాడు. కౌత్సుడు వెళ్లేసరికి ఆయన మట్టిపిడతలతోనే సంధ్యావందనం చేసుకుంటున్నాడు. అది గమనించిన కౌత్సుడు ఏమీ అడగకుండానే వెనుదిరగబోతుండగా, రఘుమహారాజు అతన్ని ఉండమన్నట్లుగా సైగ చేసి, సంధ్యావందనం ముగియగానే ఏం కావాలని అడిగాడు. గురుదక్షిణ చెల్లించడానికి తనకు 14 లక్షల బంగారు నాణాలు కావాలన్నాడు కౌత్సుడు. ఎవరినీ ఖాళీ చేతులతో పంపకూడదన్న నియమం కలవాడైన ఆ రాజు ‘‘అలాగే ఇస్తాను కానీ, ప్రస్తుతానికి లేవు కాబట్టి రేపు ఉదయం వచ్చి తీసుకు వెళ్లు’’ అని చెప్పాడు. సరేనంటూ సంతోషంగా సెలవు తీసుకున్నాడు కౌత్సుడు. తన వద్ద ధనం లేదు కాబట్టి, ఏం చేయాలో తగిన తరుణోపాయం చెప్పమని గురువైన వశిష్ఠుని అడిగాడు రఘుమహారాజు.
‘‘రాజా! నీకు కావలసిన ధనాన్ని సమకూర్చగల సమర్థుడు ఇంద్రుడొక్కడే. కాబట్టి వెంటనే ఇంద్రుని మీద దండెత్తడమే ఉత్తమం’’అని సలహా ఇచ్చాడు వశిష్టుడు. గురువు సలహా మేరకు వెంటనే ఇంద్రుని మీద యుద్ధం చేస్తున్నట్లుగా భేరీలు మోగించాడు రఘువు. ఆ భేరీ నాదాలు అయోధ్యా నగరం నుంచి వస్తున్నాయని తెలుసుకున్న ఇంద్రుడు వెంటనే ధర్మపరాయణుడు, పరాక్రమవంతుడు అయిన రఘుమహారాజుకు కోపం తెప్పించడం కంటే ఆయనతో సంధి చేసుకోవడమే మేలని, దిక్పాలకులను ఆదేశించి, ఆ రాజ్యమంతటా బంగారు వర్షం కురిపించాడు. కొద్దిసేపటిలోనే కోశాగారమంతా నిండి, రాజ్యమంతటా బంగారు నాణాలతో నిండిపోయింది. దాంతో వెంటనే ఇంద్రునిపై యుద్ధం విరమిస్తున్నట్లు ప్రకటించి రఘుమహారాజు, కౌత్సుడిని పిలిపించి, నీవడిగిన ధనం కోశాగారంలో ఉంది తీసుకు పొమ్మని చెప్పాడు. తనకు కావలసిన దానికన్నా ఎక్కువ ధనం ఉందని తెలుసుకున్న కౌత్సుడు తనకు కావలసినంత మాత్రమే తీసుకుని వెళ్లి, గురుదక్షిణ చెల్లించుకున్నాడు. మిగిలిన ధనమంతటినీ ఇంద్రుడికి తిరిగి పంపించేశాడు రఘువు. అంతటి ధర్మాత్ముడైన రఘు వంశంలో పుట్టిన వాడు కాబట్టే రాముడికి ఆయన గుణాలన్నీ అలవడ్డాయి.
– డి.వి.ఆర్.