
నిజాం వెంకటేశం
సాహితీవేత్త, పుస్తక ప్రేమికుడు నిజాం వెంకటేశం మృతి తెలుగు సాహితీలోకాన్ని కలచివేసింది.
సాహితీవేత్త, పుస్తక ప్రేమికుడు నిజాం వెంకటేశం మృతి తెలుగు సాహితీలోకాన్ని కలచివేసింది. అప్పటివరకూ ఆరోగ్యంగా ఉన్న ఆయన హఠాత్తుగా సెప్టెంబర్ 18 సాయంత్రం గుండెపోటుతో అసువులు బాశారు. ఆగస్టు 31న తల్లిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న వెంకటేశంను పలకరించి ఓదార్చిన సాహితీ మిత్ర బృందానికి ఆయన అర్ధంతర నిష్క్రమణ దిగ్భ్రాంతిని కలిగించింది. నచ్చిన పుస్తకాన్ని పదుల సంఖ్యలో కొని, పంచి, మురిసిపోయిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయన 1948లో సిరిసిల్లాలో జన్మించారు. విద్యుత్ శాఖలో ఇంజినీర్‌గా విధులు నిర్వ హించి 1997లో స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన తర్వాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు ఎన్నో సాహితీ కార్యక్రమాల నిర్వహణకు, పుస్త కాల ప్రచురణకు సహకరించారు. కవిత్వం పట్ల ప్రేమతో 1980 దశకంలో ‘దిక్సూచి’ కవితా సంచి కలు వెలువరించి యువ కవులకూ ప్రోత్సాహాన్ని చ్చారు. అలిశెట్టి ప్రభాకర్ దీర్ఘకవిత ‘నిజరూపం’ అందులోనే వచ్చింది. కరీంనగర్ బుక్ ట్రస్ట్ ఆరంభించి అల్లం రాజయ్య ‘భూమి’ కథలు, బీఎస్ రాములు ‘బతుకు పోరు’ నవలను ప్రచురించారు.
1950 దశకంలో తెలంగాణ మాండలీకంలో వచ్చిన గూడూరి సీతారాం కథలు కొత్త తరానికి పరిచయమయ్యేలా 2010లో పుస్తకరూపంలో రావడానికి తోడ్పడ్డారు. 2013లో అలిశెట్టి సమగ్ర కవితా సంపుటి రాకలో ప్రధానపాత్ర పోషించారు. న్యాయవాది విద్యాసాగర్ రెడ్డి దేశంలో ఆర్థికరంగ మార్పులను సూచిస్తూ రాసిన మూడు ఇంగ్లిష్ పుస్తకాలను తెలుగులోకి అనువదించారు. సేంద్రియ వ్యవసాయ నిపుణులు సుభాష్ పాలేకర్ పుస్తకాన్ని కూడా తెనిగించారు. పుస్తకాన్నీ, రచయితనీ, మంచితనాన్నీ ఏకకాలంలో సమానంగా ప్రేమించిన అరుదైన వ్యక్తి వెంకటేశం. ఆయనకు నివాళి.
– బి. నర్సన్