
కత్తిపోట్లకు ఎనిమిది మంది బలి
17 మందికి గాయాలు
బీజింగ్: చైనాలో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. విచ్చలవిడిగా కత్తిపోట్లకు పాల్పడ్డాడు. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, 17 మందికి కత్తిపోట్ల గాయాలయ్యాయి. శనివారం చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. యిక్సింగ్ సిటీలోని వుక్సి వొకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ టెక్నాలజీలో షూ అనే 21 ఏళ్ల ఉన్మాది శనివారం సాయంత్రం 6:30 గంటలకు ఈ దాడికి తెగబడ్డాడు. కనిపించిన వారినల్లా కత్తితో పొడిచాడు.
మొత్తం ఎనిమిది మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. మరో 17 మంది గాయపడ్డారు. నిందితుడిని సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నారు. తానే ఈ దాడికి పాల్పడ్డట్లు నిందితుడు అంగీకరించాడు. వుక్సి వృత్తివిద్య సంస్థలో పూర్వ విద్యార్థి అయిన షూ కొన్ని పరీక్షల్లో ఫెయిలయ్యాడు. అలాగే ఇంటర్న్‌షిప్ కాలంలో తనకు చెల్లించిన సొమ్ముపై అసంతృప్తితో రగిలిపోయాడు.
గ్రాడ్యుయేషన్ సర్టీఫికెట్ రాలేదనే కోపంతో ఇన్‌స్టిట్యూట్‌కు వచ్చి దాడికి తెగబడ్డాడు. పోలీసులు సహాయకచర్యలు చేపట్టి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ వారంలో ఇది సాధారణ పౌరులపై జరిగిన రెండోదాడి. ఈనెల 12న జుహాయ్ నగరంలో ఒక దుండగుడు జనంపైకి కారును తోలడంతో ఏకంగా 35 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.