
క్రిస్టఫర్ కేసీ
మేరీల్యాండ్: చెవులకు చిల్లులు పడేలా గురుక పెట్టకురా అన్నందుకు ఓ పెద్దాయనను పొడిచి చంపిన ఘటన అమెరికాలో జరిగింది. పెన్సిల్వేనియా రాష్ట్రం మోంట్‌గోమేరీ కౌంటీలో 62 ఏళ్ల రాబర్ట్ వాలెస్ తల్లితో కలిసి ఉంటున్నాడు. అదే డూప్లెక్స్ భవనంలో 55 ఏళ్ల క్రిస్టఫర్ కేసీ ఒంటరిగా ఉంటున్నాడు. క్రిస్టఫర్ పెడుతున్న భారీ గురకను వినలేకపోతున్నానని ఏడాదిన్నరగా రాబర్ట్ చెప్పీచెప్పీ విసిగిపోయాడు.
విషయం పోలీసుల దాకా వెళ్లింది. వాళ్లు నచ్చజెప్పినా లాభం లేకపోయింది. క్రిస్టఫర్, రాబర్ట్‌ల పడక గదులు పక్కపక్కనే ఉండటం, ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా ఉండటంతో గురక రాబర్ట్‌కు బాగా ఇబ్బందిపెట్టేది. విసిగిపోయిన పెద్దాయన చివరకు జనవరి 15న సాయంత్రం క్రిస్టఫర్ వరండా దగ్గరికొచ్చి బెదిరించాడు.
వినకపోవడంతో అతని కిటికీ స్క్రీన్‌ను చింపేసి చంపేస్తానని అరిచాడు. ఒకనొక సమయంలో నీ గురక సమస్యకు శస్త్రచికిత్స చేయిస్తానని కూడా మాట ఇచ్చాడు. వాగ్వాదం చాలాసేపు జరిగి ఆగిపోయే సమయానికి క్రిస్టఫర్ తలుపుతీయడంతో రాబర్ట్ మళ్లీ తిట్లపురాణం మొదలెట్టాడు. వీరావేశంతో ఉన్న గురకమహాశయుడు వెంటనే కత్తితో రాబర్ట్ గుండెలపై పలుమార్లు పొడిచి చంపాడు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.