
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం పార్లమెంట్‌లోని దిగువసభ నేషనల్ అసెంబ్లీ విశ్వాసం పొందారు. మొత్తం 342 మంది సభ్యులకుగాను 180 మంది షరీఫ్ నాయకత్వంపై విశ్వాసం ప్రకటించారు. షరీఫ్ ప్రభుత్వం, న్యాయ వ్యవస్థకు మధ్య ఇటీవలి కాలంలో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. గత ఏడాది అధికారంలోకి వచ్చిన సమయంలో షరీఫ్‌కు 174 మంది సభ్యులు మాత్రమే మద్దతు తెలపడం గమనార్హం.
పంజాబ్, ఖైబర్ పఖ్తున్వా ప్రావిన్స్ అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకు పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ)కి అవసరమైన నిధుల కేటాయింపునకు సంబంధించిన బిల్లును నేషనల్ అసెంబ్లీ ఇటీవల తిరస్కరించిన నేపథ్యంలో షరీఫ్ ప్రభుత్వం బలనిరూపణకు సిద్ధమయింది. వెంటనే పార్లమెంట్ ఎన్నికలు జరపాలంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని పీటీఐ పార్టీ గట్టిగా పట్టుబడుతోంది.