
వాషింగ్టన్: తనను దేశం విడిచి వెళ్లేలా చేసిన కుట్ర వెనుక అమెరికా ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనా చేసినట్లు చెబుతున్న ఆరోపణలను వైట్‌హౌజ్ తోసిపుచ్చింది. ఈ విషయమై వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీ జీన్‌పియెర్రె సోమవారం(ఆగస్టు12) మీడియాతో మాట్లాడారు. ‘బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్‌హసీనాను పదవి నుంచి దించడంలో మా పాత్ర ఏమీ లేదు.
ఈ విషయంలో అమెరికాపై వచ్చిన ఆరోపణలేవీ నిజం కావు. భవిష్యత్తు ప్రభుత్వంపై బంగ్లాదేశ్ ప్రజలే నిర్ణయం తీసుకోవాలి. అక్కడి పరిణామాలను గమనిస్తుంటాం’అని పియెర్రె తెలిపారు. సెయింట్ మార్టిన్స్ ఐలాండ్‌ను అప్పగించనందుకే తనను పదవి నుంచి అమెరికా దించిందని షేక్‌హసీనా ఆరోపించినట్లు మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే తన తల్లి అలాంటి ఆరోపణలేవీ చేయలేదని షేక్‌హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ చెప్పడం గమనార్హం.