
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జనగామ: ప్రభుత్వ పథకాల అమలుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం నుంచి ఇందిరమ్మ ఇళ్లు, రాజీవ్ యువ వికాసం, తాగునీటి సరఫరా, ఎల్‌ఆర్‌ఎస్ క్రమబద్ధీకరణ, పింఛన్లు, కుక్కకాటు నివారణ తదితర అంశాలపై స్పెషల్ డిప్యూ టీ కలెక్టర్లు, ఆర్డీఓలు, మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీఓలు, పంచా యతీ కార్యదర్శులతో గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇంది రమ్మ ఇళ్ల కోసం అర్హులను మాత్రమే ఎంపిక చేయాలన్నారు. మండల, మున్సిపాలిటీ స్థాయిలో ఇందిరమ్మ, వార్డు కమిటీల ద్వారా ఈనెల 18 నుంచి 21 వరకు ఎంపీడీఓలకు వచ్చే జాబితా ప్రకారంగా లబ్ధిదారులను గుర్తించాలని చెప్పారు. 22 నుంచి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ నిబంధనల మేరకు సర్వేచేసి అర్హులను ఎంపిక చేయాలని సూచించా రు. మే 2న జీపీ కార్యాలయాల్లో అర్హుల జాబితా ప్రదర్శించడంతోపాటు మే 3 నుంచి 5 వరకు లబ్ధిదారుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేశాక అర్హులకు ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం కింద ఎంపీడీఓలు మండల స్థాయిలో బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న శాశ్వత వలస పింఛన్లు, మరణించిన పింఛన్‌దారుల పరిశీలన వేగంగా చేపట్టాలని తెలిపారు. తాగునీటి వనరులు లేని గ్రామాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద వచ్చిన దరఖాస్తుదారుల భూముల పరిశీలన వేగంగా చేపట్టాలని, అభ్యంతరాలు లేని వాటికి ప్రొసీడింగ్స్ జారీ చేయాలని ఆదేశించారు. వీధి కుక్కల విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సమీక్షలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమాన్‌నాయక్, ఆర్డీఓలు గోపిరాం, వెంకన్న, మున్సిపల్ కమిషనర్‌లు వెంకటేశ్వర్లు, రవీందర్, డీపీఓ స్వరూపరాణి, డిప్యూటీ సీఈఓ సరిత, ఎల్డీఎం శ్రీధర్, ఈడీ ఎస్పీ కార్పొరేషన్ మాధవిలత, గృహ నిర్మాణ శాఖ పీడీ మాతృనాయక్ తదితరులు పాల్గొన్నారు.
మహనీయుల ఆశయాలను
స్ఫూర్తిగా తీసుకోవాలి..
మహనీయులు డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, బాబు జగ్జీవన్‌రామ్, జ్యోతిబాపూలే ఆశయాలను స్ఫూర్తి గా తీసుకుని ముందుకు సాగాలని కలెక్టర్ రిజ్వానా బాషా అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో మహనీయుల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యాన పార్నంది వెంకటస్వామి అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో కమిటీ గౌరవ అధ్యక్షుడు మేడ శ్రీనివాస్, పలు శాఖల అధికారులు డాక్టర్ విక్రమ్ కుమార్, మాధవిలత, రవీందర్, వెంకటేశ్వర్లు, పులి శేఖర్, డాక్టర్లు సీహెచ్.రాజమౌళి, సుగుణాకర్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
‘కుంట’ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జిల్లా కేంద్రం సూర్యాపేట రోడ్డులోని బతుకమ్మకుంట అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం బతుకమ్మ కుంటను సందర్శించిన కలెక్టర్ మాట్లాడుతూ.. బతుకమ్మకుంటను మరింత అభివృద్ధి చేయడానికి రూ.కోటి 50 లక్షలు మంజూరయ్యాయని, సుందరీకరణ నేపథ్యంలో గ్రిల్స్, కాలిబాట, లైటింగ్, వ్యాయామ పరికరాలు, చిన్నారులకు ఆటస్థలం, పరికరాలు, మినీ పార్కు పనులు నెలరోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే కుంట పూడికతీత పనులు త్వరగా పూర్తిచేయాలన్నారు. మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నీటి పారుదల శాఖ ఈఈ మంగీలాల్, ఏఈ మహిపాల్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా

అధికారులు సమన్వయంతో పనిచేయాలి